విపత్తు నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి

share on facebook

విపత్తు నిర్వహణ అన్నది ఉమ్మడి వ్యవహారంగా ఉంటనే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తక్షణం ఆదుకునేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేసుకోవాలి. ప్రత్యేకంగా నిధులను సమకూర్చాలి. లేదా కేంద్ర,రాష్ట్రాలు ఉమ్మడిగా నిధులు సమకూర్చాలి. అలాగే దీనిని సైన్యంలో ఒక భాగంగా చేస్తే మంచిది. భారత్‌ లాంటి దేశానికి ఇది తక్షణావసరమని పాలకులు గుర్తించాలి. ఇప్పటివరకు జరిగిన అనేక విప్తతులను దృష్టిలో పెట్టుకుని తగిన తర్ఫీదు ఇచ్చి స్వయం శక్తిగా దీనిని రూపొదించాలి. దేశంలో ఎక్కడ ఏ మూలన ఎలాంటి ఉపద్రవం వచ్చిపడినా తక్షణం రంగంలోకి దిగేలా అన్ని రాష్ట్రాల్లో సన్నద్దంగా ఉండేలా చూడాలి. ఇటీవలి కాలంలో ఉత్తరాది, దక్షిణాది అన్న తేడా లేకుండా వరదలు ముంచెత్తాయి. హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలు ఇంకా భారీ వర్షాలతో అల్లాడు తున్నాయి. దీంతో సాయం కోసం ఇరు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి. కేంద్రం విదిలింపులపై రాష్ట్రాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. విపత్తుల సమయంలో ఇలాంటి విమర్వలకు తావులేకుండా స్వతంత్ర వ్యవస్థ రంగంలోకి దిగి ప్రజలను కాపడడంతో పాటు, సహయాక చర్యల్లో నిమగ్నమయ్యేలా ఉంటే విమర్శలకు ఆస్కారం ఉండదు. హిమాచల్‌ ప్రదేశ్‌, కేరళలో గతవారం రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలు పెను విలయాన్ని సృష్టించాయి. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, విరిగిపడుతున్న కొండ చరియలు, తెగిపోయిన రోడ్లు సాధారణ పౌర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సకాలంలో సహాయక శిబిరాలకు తరలించడం, ప్రాణ నష్టాన్ని తగ్గించగలగడం అన్నది ఇలాంటి సమయాల్లో ముఖ్యం. పునరావాస శిబిరాల్లో బాధితులకు మంచినీరు, ఆహారం, మందులు వంటి కనీస సదుపాయాలు కల్పించడం,అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కూడా ముఖ్యమే. ప్రత్యేక యంత్రాంగం ఉండివుంటే వెంటనే రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు చేపట్టే వీలుంటుఏంది. ప్రస్తుత వ్యవస్థలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర విపత్తు, సహాయక బృందాలు ప్రశంసనీయమైన కృషిచేస్తున్నాయి. అయితే ఇందులో ప్రధాన భూమిక రాష్ట్రాలదిగానే ఉంటోంది. అలాగాకుండా వ్యవస్థ ఉంటే సాయం కోసం కేంద్రంవైపు చూడాల్సిన ఆగత్యం రాదు. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలు, చలన చిత్ర పరిశ్రమ, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఉదారంగా ముందుకు వచ్చి విరాళాలందిస్తున్నారు. అయితే ఏటా ఎక్కడో ఓ చోట ఇలాంటి విపత్తులు సర్వ సాధారణంగా మారిన దశలో ప్రత్యేక,శాశ్వత ఏర్పాటు అవసరాన్ని గుర్తించాలి. హిమాచల్‌ ప్రదేశ్‌లో 117 ఏళ్ల తరవాత భారీగా వరదలు వచ్చి పడ్డాయి. అనేక భవనాలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి. కళ్లముందే భవనాలు, కొండచరియలు కూలిపడ్డాయి. చెట్లు కూకటి వేళ్లతో కూలాయి. మొత్తం జలమయమయ్యాయి. కళ్లముందే అంతా వర్షార్పణం అవుతుంటే గ్రాఫిక్‌ సినిమాలు తలపించేలా పరిస్థితి ఉంది. ఇక కేరళలోనూ ఇంకా పరిస్థితి కుదుటపడలేదు. భారీ వర్షాల మూలంగా పెద్దయెత్తున నీరు వచ్చి చేరుతుండడంతో కేరళలో ప్రధానమైన 27 డ్యాముల గేట్లను తెరవాల్సి రావడంతో దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధనం లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఇడుక్కి డ్యామ్‌ గేట్లు 26 ఏళ్ల తరువాత మొదటి సారి ఎత్తారంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటో అర్థమవుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చినవి అసాధారణ వరదలు కావడంతో పెద్దయెత్తున ఆస్తినష్టం కలిగించాయి. కేరళలో అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు డెబ్బయివేల మంది దాకా నిరాశ్రయులయ్యారు. ముంపునకు గురైన 443 గ్రామాల్లో 20వేలకు పైగా ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంటలు తుడిచి పెట్టుకునిపోయాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ, సహాయక అథారిటీని పటిష్టపరచినప్పటికీ ఇప్పుడు సంభవించిన విపత్తు అసాధారణ మైనది. దీనిని ఎదుర్కోవడం అంత తేలికేవిూ కాదు. అయినా, పరిస్థితి తీవ్రతకు మించిన వేగంతో ప్రభుత్వం కదిలింది.నదికి ఇరువైపులా వున్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసింది. పంట నష్ట పోయిన రైతులను ఉదారంగా ఆదుకుంటా మని, వరదల్లో విలువైన డాక్యుమెంట్లు కోల్పోయినవారికి ఉచితంగా వాటిని తిరిగి అందిస్తామని హావిూ ఇచ్చింది. వరద బాధితుల సహాయనిధికి రెండురోజుల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల కు విజ్ఞప్తి చేసింది. ప్రాథమిక అంచనా ప్రకారం వరద నష్టం రు.8,316 కోట్లు, తక్షణ సహాయ పునరావాస చర్యలకుగాను రు.3000 కోట్లు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. విపత్తులను ఎదుర్కోవడంలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అనుసరించిన మార్గాలే ఇప్పుడు శరణ్యంగా మారాయి. ఈ దుస్తితి పోవాలంటే ఓ అత్యున్నత వ్యవస్థ అవసరం అన్నది గుర్తించాలి. కేంద్రరాష్ట్రాలు ఇందుకు ముందుకు రావాలి. ఉమ్మడిగా వ్యవస్థను తయారుచేసుకోవాలి. దీనిని ఆర్టీలో భాగంగా చేస్తే మరీ మంచిది. సాధారణ ఆర్టీ ఇలాంటి సమయాల్లో అంతగా పనిచేయకపోవచ్చు. కానీ విపత్తు నిర్వహణకు కూడా ఆర్మీలాంటి దళాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తే మంచిది. భూకంపాలు, అగ్నిప్రమాలు, వరదలు లాంటి ప్రమాదాల సమయాల్లో తక్షణం స్పందించేలా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి దళాలను ఏర్పాటు చేయడంతో పాటు,ఆర్థిక సంపత్తిని కూడా కట్టిబెడితే మంచిది. దీనిద్వారా విపత్తు నిర్వహణతో పాటు, నిరుద్యోగ సమస్యకూడా కొంతమేర తీరవచ్చు. ఈ దిశగా ఆలోచనలు చేసి ఆచరణకు సిద్దపడాలి.

 

Other News

Comments are closed.