వృత్తి ధర్మం వీడడం వల్లనే బరితెగింపులు పెరిగాయి 

share on facebook

పాలకుల అక్రమాలను నిగ్గదీసే జర్నలిజం ఎప్పుడో చచ్చిపోయింది. ఎక్కడో ఒకచోట అరకొరా అక్రమాలను నిలదీసే లేదా వెలికి తీసే వార్తలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. అయినా వృత్తికి బానిసలుగా మారిన కొందరు అడపాదడపా వార్తలను, వ్యాసాలను రాస్తూనే ఉన్నారు. అలాంటి వారికి సమాజంలో అండ దొరకడం లేదు. అలాగే వారికి జీవించే హక్కు లేకుండా చంపేసే దుష్ట సంస్కృతి విస్తరిస్తోంది. గతంలో దేశంలో ఎక్కడ కూడా ఓ జర్నలిస్టుపై చేయి వేయాలంటే భయపడే వారు. కానీ ఇప్పుడు ఏకంగా లేపేస్తున్నారు. పెట్టుబడిదారుల కబంధ హస్తాల్లో మాధ్యమాలు చిక్కుకోవడంతో జర్నలిజం అన్నది వృత్తిగా కాకుండా ఉద్యోగంగా మారింది. డేరా బాబా అక్రమాలను నిలదీస్తూ రాసిన లేఖను ప్రచురించిన ఛత్రపతి అనే జర్నలిస్టును డేరాబాబా గుండాలు అంతమొందించినా దేశం పట్టించుకోలేదు. ఆయన చేసిన త్యాగం ఓ దశాబ్దం తరవాత ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కాలం కలసిరాక డేరాబాబా జైలులో ఉన్నాడే తప్ప మరోటి కాదు. హత్యకు గురైన ఛత్రపతి కేసుఇంకా కొలిక్కిరాలేదు. ఎందరో జర్నలిస్టులు వృత్తిలో నిబద్దతతో ప్రాణత్యాగాలు చేస్తూనే ఉన్నారు. పట్టువదలని విక్రమార్కుల్లాగా అక్కడక్కడా తమ కలానికి పదును పెడుతూనే ఉన్నారు. అయితే మారిన సమాజంలో ఇలాంటి వార్తలకు ప్రాధాన్యం లేకుండా పోయింది. పాలకులను కీర్తిస్తూ వారు చేస్తున్న అకృత్యాలను బ్రహ్మాండం అంటూ పొగిడే నయా జర్నలిజం నడుస్తున్న కాలం ఇది. పాలకుల చెప్పిందే వార్తగా ఇవాళ పతాకశీర్షికలో ప్రచురితం అవుతున్నాయి. వారు తుమ్మినా దగ్గినా వార్త అవుతోంది. అదే ఆరోజుకు ప్రధాన వార్తగా ప్రచురితం అవుతోంది. సామాజిక మాధ్యమాలు విచ్చుకున్న వేళ అడపాదడపా కొన్ని నిజాలు తెలుస్తున్నాయి తప్ప పత్రికలు లేదా వార్తా ఛానళ్లు మాత్రం తమ బాధ్యతలను విస్మరించాయి. కారణం పైన చెప్పుకున్నట్లు తమ చేతుల్లో సంస్థలు లేకపోవడమే. సామాజిక మాధ్యమాల్లో అనేకానేక అంశాలు వెల్లడవుతున్నా కనీసం వాటిని ఆధారంగా చేసుకుని కూడా పాలకుల అక్రమాలను నిలదీయడంలో వృత్తి జర్నలిస్టులు ముందుకు రావడం లేదు. డేరాబాబా అక్రమాలు చేస్తున్నాడని, హత్యలు చేస్తున్నాడని, రేప్‌లు చేస్తున్నాడని తెలిసినా ప్రముఖ జర్నలిస్టులు ఎవరు కూడా నిలదీయలేదు… ఎందుకంటే సమాధానం లేదు. నిజంగా నిలదీసి వుంటే ఛత్రపతికి జరిగినట్లుగానే జరిగేది. అందుకే జర్నలిస్టుల్లో కూడా ఉద్యోగపరమైన ఆందోళన నెలకొంటోంది. మనకెందుకులే అన్న పెడధోరణి వ్యక్తం అవుతోంది. అంతోఇంతో సాహసించే వారు సమాధి అవుతున్నారు. తాజాగా బెంగుళూరులో గౌరీ లంకేశ్‌ హత్యోదంతం ఇలాంటిదే. ఎంతటివారినైనా నిలదీయడానికి వెనకాడని ఆమె ధిక్కార స్వరాన్ని సమర్థించని స్వరాలున్న చోట ఆమె స్వరం మూగబోయింది. ఇలాంటి దురాగతాలను వెలికితీసయడమో లేక నిలదీయడమో చేసినందుకే చీకట్లో మాటుగాసిన దుండగులు బెంగళూరు నగరంలో ప్రముఖ మహిళా జర్నలిస్టు ‘గౌరీ లంకేశ్‌’ పత్రిక సంపాదకురాలు అయిన గౌరీ లంకేశ్‌ను పొట్టనబెట్టుకున్నారు. ఈ హత్యతో ఇప్పుడు జర్నలిస్టులు, మేధావులు మేల్కొని ఆందోళనకు దిగారు. ఈ దేశంలో వర్తమాన స్థితిగతులకు ఈ హత్యోదంతం అద్దం పడుతుంది. ఆమె వ్యక్తిత్వం, ఆమె సాహసం తదితర అంశాలు ఇప్పుడు చర్చగా మారాయి. అంటే ఆమెపై వ్యతిరేకత ఉందన్నది సుస్పష్టం. ఆమెను అంతమొందించేందుకు పక్కాప్రణాళిక ఉందని కూడా తెలుస్తోంది. సహచరులు, సన్నిహితులు ఈ విషయంలోనే ఆమెను తరచు హెచ్చరించే వారని, జాగ్రత్తలు పాటించమని సూచించేవారని కుటుంబసభ్యులంటున్నారు. కానీ అధికారమదంతో చెలరేగే… మతోన్మాదంతో శివాలెత్తే వారిని ఆమె తనకలం ద్వారా నిలదీయడం ఆపలేదు. అంటే ఆమె ధైర్యంగా నిలబడ్డారే తప్ప వెనక్కి తగ్గని ధీరవనితగా ఉండిపోయారు. జర్నలిస్టుగా ఆమె నిబద్దతో పనిచేశారు. ఆమె ఆధ్వర్యంలో వెలువడుతున్న ‘గౌరీ లంకేశ్‌’ పత్రిక ప్రభుత్వాల నుంచిగానీ, ప్రైవేటు సంస్థల నుంచిగానీ ఎలాంటి వాణిజ్య ప్రకటనలనూ స్వీకరించ కూడదన్న నియమం పెట్టుకుంది. కేవలం పాఠకులు చెల్లించే చందాలతో, పత్రిక వెలువరించే వివిధ రకాల గ్రంథాల అమ్మకం ద్వారా లభించే ఆదాయంతోనే నడిపించారు. గౌరి లంకేశ్‌ తన పత్రికను ప్రత్యేకించి దళితులకూ, రైతులకూ, ఇతర అణగారిన వర్గాలకూ వేదికగా మలిచారు. అధికారంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్‌ ఉన్నా ఆ ప్రభుత్వాల దుర్నీతిని ఎండగట్టారు. వారి అవినీతి, అక్రమాలను నిలదీశారు. ఈ క్రమంలో వస్తున్న బెదిరింపులనూ, హెచ్చరికలనూ, కించపరుస్తూ చేసే వ్యాఖ్యానాలనూ ఆమె పట్టించుకోలేదు. మనమే భయపడితే వీటన్నిటినీ బయటపెట్టేదె వరని గౌరి ప్రశ్నించేవారు. ఆ సాహసమే ఆమెకు శతృవులను పెంచింది. అసహనంతో రగిలిపోయే శక్తులు ఎప్పుడు కూడా ఖతం రాజకీయాలను ఆశ్రయిస్తాయి. చిన్నపత్రికతో డేరాబాబాను నిలదీసి హత్యకు గురైన ఛత్రపతి లాగానే గౌరీ కూడా హత్యకు గురయ్యారు. కానీ వారు మనకో గుణపాఠం నేర్పారు. ధైర్యంగా వార్తలు రాయాలని సందేశం ఇచ్చారు. అమ్ముడు పోకండని హెచ్చరిస్తున్నారు. వారి జీవితాలు లేదా వారు అనుసరించన మార్గాలు జర్నలిస్టులకు పాఠం కావాలి. తమ వృత్తిధర్మాన్ని వీడడం వల్లనే సమాజంలో అరాచకం చెలరేగుతోందని, పాలకుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని గుర్తుంచుకోవాలి. జర్నలిస్టు ఉద్యోగానికి మాత్రమే కట్టుబడి వృత్తి ధర్మాన్ని విస్మరిస్తే సమాజంలో అశాంతి చెలరేగుతుంది. అక్రమాలు సక్రమాలుగా మారుతాయి. అరచకాలకు లెక్కలేకుండా పోతోంది. అన్నార్తులకు గొంతు లేకుండా పోతుంది. అందుకే జర్నలిస్టులు వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడం ద్వారా దాడులను ప్రతిఘటించాలి. తమకలాలకు పదను పెట్టాలి. పత్రికలు చిన్నవా పెద్దవా అన్నది కాకుండా అన్యాయాలపై గళమెత్తాలి. ప్రజల గొంతుక కావాలి. పాలకుల గొంతులో నుంచి బయటపడాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది. మన బాధ్యతా నెరవేరుతుంది.

Other News

Comments are closed.