వైఎస్‌ ధనయజ్ఞం చేస్తే..బాబు జలయజ్ఞం చేస్తున్నారు

share on facebook

సీమకు సాగునీటి కల నెరవేరుతోందన్న పల్లె

అనంతపురం,జనవరి7(జ‌నంసాక్షి):చంద్రబాబునాయుడు ఎంతో ముందు చూపుతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాధరెడ్డి అన్నారు. రాయలసీమకు నీటి తరలింపు కోసం ముచ్చుమర్రి చేపట్టి నీటి తరలింపును సాకారం చేశారని అన్నారు. హంద్రీ-నీవా ద్వారా కుప్పంకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో పుంగనూరు నుంచి కుప్పం వరకు రూ.800 కోట్లు ఖర్చుచేసి కాలువలు, కల్వర్టులు, బ్రిడ్జిలు కట్టిస్తున్నట్లు తెలిపారు. పులివెందులకు గండికోట నుంచి నీళ్లు ఇస్తున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మట్టి పనులు చేపట్టి జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారన్నారు. రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు చేపడుతుంటే విమర్శలు చేయడం తగదన్నారు. గోదావరిలో 1000 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని వాడుకుని రాయలసీమకు నీళ్లు తేవాలని పట్టిసీమ కడితే దానిపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. పట్టిసీమ ద్వారా 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చి పంటలు కాపాడిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుదేనన్నారు. పోలవరం, పురుషోత్తం పట్నం సాగునీటి ప్రాజెక్టును రూ.1683 కోట్లుతో చేపడుతున్నట్లు తెలిపారు. తద్వారా సాగు,తాగునీరు విశాఖజిల్లాకు అందించనున్నట్లు తెలిపారు. జన్మభూమి-మా వూరు కార్యక్రమం ద్వారా అధికారులే గ్రామాలకు వచ్చి ప్రజాసమస్యలను పరిష్కరిస్తుండటం హర్షణీయమని ప్రభుత్వ చీఫ్‌విప్‌ పల్లె రఘునాధరెడ్డి అన్నారు. ప్రజలు ఇందులో పాల్గొని తమ సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేసే అవస్థలు లేకుండా జన్మభూమి-మా వూరు కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చామని తెలిపారు. రాజకీయాలకతీతంగా ప్రతి లబ్ధిదారునికి రేషన్‌కార్డులు, పింఛన్లు అందిస్తున్న ఘనత తెదేపాకే దక్కిందన్నారు. గతంలో రేషన్‌కార్డులు, పింఛన్ల కోసం ప్రతి పంచాయతీలో వందల కొద్దీ అర్జీలు వచ్చేవని, నేడు పదులసంఖ్యలో మాత్రమే రావడం తమ ప్రభుత్వ ఘనత అన్నారు. ప్రతి పేదకుటుంబం సంక్రాంతిని ఆనందంగా జరుపుకోవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్రాంతి కానుకలను అందిస్తున్నారన్నారు. మహిళల ఆత్మగౌరవానికి ప్రతిఇంటా మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించే స్థాయి వైకాపా నేతలకు లేదని పేర్కొన్నారు.

Other News

Comments are closed.