వ్యవసాయానికే పెట్టుబడి ఉపయోగించండి

share on facebook

పంటలు పండించి నమ్మకాన్ని నిలబెట్టండి: గొంగిడి సునీత
యాదాద్రి భువనగిరి,మే16(జ‌నం సాక్షి):  ప్రభుత్వం అందిస్తోన్న ఉచిత ఆర్థికసహాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని విప్‌, ఎమ్మెల్యే గొంగిడి సునీత అన్నారు. ఎరువులు, విత్తనాలకు, ఇతర వ్యవసాయ పనులకు మాత్రమే సాగు పెట్టుబడిని వినియోగించుకోవాలన్నారు. నేరుగా బ్యాంకులకు వెళ్లి ఆధార్‌ కార్డును చూపించి డబ్బును డ్రా చేసుకోవచ్చన్నారు. చెక్కు మూడునెలల పాటు చెల్లుబాటులో ఉంటుందన్నారు. రైతుబంధు పథకంతో వ్యవసాయ రంగంలో సరికొత్త వెలుగులు రానున్నాయని, సాగు కోసం దళారుల వద్దకు, వడ్డీవ్యాపారుల వద్దకు వెళ్లి అప్పులు చేసే సమస్యల నుంచి సీఎం కేసీఆర్‌
గట్టెక్కించారని అన్నారు.  రైతులకు ఉచితంగా పెట్టుబడిని అందిస్తున్నారని ఎమ్మెల్యే  అన్నారు. దేశంలోనే రైతులను ఆదుకొని, వారికి ప్రయోజనం కలిగించే విధంగా సీఎం కేసీఆర్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పంటకు రూ.4 వేల చొప్పున రెండు పంటలకు రూ.8 వేలు ఇవ్వడం ద్వారా రైతులకు వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడిని ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వడం ద్వారా వారి కష్టాలనుంచి గట్టెక్కించిందన్నారు. రైతు లంతా ఒకేసారి బ్యాంకుల వద్దకు వెళ్లవద్దన్నారు. వంతులవారీగా బ్యాంకులకు వెళ్లి డబ్బును పొందాలన్నారు. రెండున్నర నెలలపాటు చెల్లుబాటు అయ్యే అవకాశం ఉన్నందున తొందర పడాల్సిన అవసరం లేదని, వ్యవసాయ పనులు చేపట్టే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణీత గడువులో సొమ్మును డ్రా చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం పట్టాదారు పాస్‌ పుస్తకాలను పకడ్బందీగా రూపొందించిందని అన్నారు. రాష్ట్రంలో ప్రతీ రైతుకు ఒకే ఖాతా నంబర్‌ ఉంటుందన్నారు. దీని వల్ల ఒకరి ఖాతా నంబర్‌ ఇంకొకరికి ఉండబోదన్నారు. ధరణి వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు పొందుపర్చారన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకాలను ఎవరైనా తాకట్టుపెట్టుకున్నా, రైతులు తాకట్టుపెట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. పట్టాదారు పాస్‌పుస్తకంలో వారసత్వంగా, క్రయవిక్రయాల ద్వారా ఏమైనా మార్పులు జరిగితే వాటిని తహసీల్దార్‌ కార్యాలయంలో సమర్పిస్తే ధరణి వెబ్‌సైట్‌లో కొత్త మార్పులను అప్‌లోడ్‌ చేస్తారన్నారు. నేరుగా రైతుల ఇళ్లకే పోస్టు ద్వారా కొత్త పట్టా దారు పాస్‌పుస్తకాలు వస్తాయన్నారు. ఇంటికే పాస్‌పుస్తకాలు పంపే సౌకర్యం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లోనే సీఎం కేసీఆర్‌ ఆలోచనతో జరుగుతోందన్నారు. రైతుబంధు కార్యక్రమ వేదికల వద్ద గ్రీవెన్స్‌ విభాగాలను రైతులకు అందుబాటులో ఏర్పాటు చేయాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖాధికారులకు సూచించారు. ఫిర్యాదు లన్నీ సక్రమంగా నమోదు చేసి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.

Other News

Comments are closed.