శబరిమలకు మన మాతృమూర్తులను స్వాగతిద్దాం  

share on facebook

ఆలయాల్లో స్వామి దర్శనానికి స్త్రీపురుష భేదం లేదా, లింగ భేదం చూపాల్సిన అవసరం లేదు. మరీ ముఖ్యంగా రుతక్రమాన్ని సాకుగా చూపి పవిత్ర శబరిమల ఆలయంలో శతాబ్దాలుగా మహిళలను దూరం చేశారు. ఇది ఓ రకమైన వర్ణవివక్షగానే చూడాలి. ఇన్నాళ్లూ దేశంలో లేదా విదేవాల్లో ఏ ఆలయంలోనూ మహిళలు తమ రుతుక్రమ సమయంలో దర్శనానికి వెళ్లరు. అంతెందుకు తిరుమల ఆలయంలో మహిళలు వెళతారా అన్నది విశ్లేషించాలి. ఎవరికి వారు తమ ఇంట్లోనే రుతుక్రమం సమయంలో పూజలకు దూరంగా ఉంటారు. పండగల సమయంలోనూ పసుపు,కుంకుమలకు సైతం దూరంగా ఉంటారు. శబరిమలలో ప్రవేశం ఉన్నా ఆదే నీతిని పాటిస్తారు. దీనికి ప్రత్యేకంగా ఆడవాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో పోరాటాల ఫలితంగా  లింగ సమాన్వత భావాన్ని బలపరుస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పునిచ్చి వారికి అండగా నిలిచింది.శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ అనుసరిస్తున్న రుతుక్రమం కొనసాగే 10-50 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళల ప్రవేశంపై నిషేధం రాజ్యాంగ విరుద్ధమని సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం వెలువరించిన  తీర్పులో ప్రకటించింది. ఈ వయోపరిమితి సంప్రదాయాన్ని మతపరమైనదిగా భావించలేమని, ఇది వివక్షతో కూడినది మాత్రమే కాక మహిళల హక్కులను కాలరాసేదిగా వుందని ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వం లోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తన తీర్పులో తేల్చిచెప్పింది. కాగా ఈ ధర్మాసనంలో సభ్యు రాలిగా వున్న న్యాయమూర్తి ఇందుమల్హోత్రా ఈ తీర్పును వ్యతిరేకిస్తూ డిసెంట్‌ నమోదు చేశారు. అయితే ఆమె భావన వేరుగా ఉన్నా దేవుడి విషయంలో ఎవరు కూడా దీనిని వ్యతిరేకించలేదు. అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని, ఆయనకు మా/-తరమే ప్రత్యేకమైన మాల వేసుకుని నిష్టగా ఉండాలని మహిళలకు కూఆ ఉంటుంది.  దైవం ముందు అందరూ సమానులేనన్న సూత్రాన్ని పాటించాలని ప్రధాన న్యాయ మూర్తి మిశ్రా తన తీర్పులో పేర్కొన్న తీరే ఇందుకు నిదర్శనం. శతాబ్దాలుగా అయ్యప్ప ఆలయంలోకి రుతుక్రమం కొనసాగే 10-50 ఏళ్ల మధ్య వయస్కులైన మహిళలను అనుమతించని కారణంగా ఎందరో మహిళలు ఆవేదన చెందుతూనే ఉన్నారు. ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ అనేక పిటిషన్‌లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం చివరకు సంచలన  తీర్పును వెలువరించింది. స్వామి అయ్యప్పకు ఎటువంటి ప్రత్యేకత లేదు. దైవం ముందు భక్తులందరూ సమానమే. ఇక్కడ ఎటువంటి లింగ వివకక్షూ తావులేదని మిశ్రా తన తీర్పులో స్పష్టం చేశారు. జీవపరమైన లక్షణాల ఆధారంగా రూపొందించు కున్న నియమ, నిబంధనలు రాజ్యాంగపరంగా చెల్లుబాటు కావని కూడా ఆయన అన్నారు. దీంతో ఓ రకంగా మహిళల విజయంగానే దీనిని చూడాలి. భగవంతుడి ముందు మహిళలు కూడా సమానమనే భావనకు మద్దతు లభించింది. వారి ఆవేదనకు అర్థం దొరికింది. ఇకపోతే వయోపరిమితితో మహిళల పట్ల అనుసరి స్తున్న ఈ నిషేధం ఒక రకమైన అస్పృశ్యత వంటిదేనని మనం ఇంతకాలం గుర్తించలేకపోయాం. మతం పేరిట మహిళలకు వున్న దైవార్చన హక్కును నిరాకరించ రాదని, మహిళలను ద్వితీయశ్రేణి దైవ సంతానంగా పరిగణించటం తగదని మనం చెప్పలేకపోయాం. ఈ దేవంలో మహిళలను అత్యుతన్నత శక్తిగా గుర్తిస్తూనే ఇలాంటి వివక్షను కొనసాగించినందుకు మనం సిగ్గు పడాలి. దీనికి తలదించుకోవాలి. ఈ తీర్పుపై మళ్లీ అప్పీలుకు వెళతామన్న ట్రావెంకోర్‌ దేవస్వం బోర్డు నిర్ణయం సరికాదని తెలుసుకోవాలి. మహిళల ప్రవేశంపై ఇంతకాలం విధించిన నిషేధం ఇక చాలు. ఇప్పటికైనా వారిని గౌరవించి మనతో పాటు అయ్యప్ప స్వామి దగ్గరికి తీసుకుని వెళ్లినంత మాత్రాన స్వామికి అపచారం జరుగుతందని అనుకోరాదు.
ఎందుకంటే వారు రుతక్రమ సమయంలో మనంరమ్మన్నా ఆలయాలకు రారు. అంతగా మన సంస్కృతి అభివృద్ది చెంది ఉన్నది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న నిషేధాన్ని మతపరమైన అంశంగా చూడరాదు.  పురుషుడి బ్రహ్మచర్యాన్ని మహిళలపై రుద్దటం వారి హక్కులను కాలరాయటమే అవుతుంది. నిజానికి స్వాముల దీక్ష సమయంలో ఇంట్లో మహిళలే ఆచారయుతంగా వండి వడ్డిస్తున్నారు. అనాగరికమైన ఆలోచనలకు ఇక స్వస్తి చెప్పడం ద్వారా మహిళలను గౌరవించామన్న పెద్ద మనసుతో మనమంతా ముందుకు సాగాల్సి ఉంది. మహిళలకు ఆలయ ప్రవేశం నిషేధించటం వారి హక్కులను ఉల్లంఘిచటమే అవుతుందన్న నిజాన్ని గుర్తించాలి. మహిళలను వేరు చేసి చూడడం ద్వారా  స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని, సమానత్వాన్ని కించపర్చటం సరికాదని గుర్తు చేసుకోవాలి. అందుకే రుతుక్రమం సాకుతో మహిళలను వెలివేయటం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని న్యాయయమూర్తులు అభిప్రాయ పడ్డారు. నైతికతకు సంబంధించిన భావన ఇతరుల ఆత్మగౌరవాన్ని కించపర్చేలా వుండకూడదని వ్యాఖ్యానించారు. మతేతరమైన కారణాలతో మహిళలపై అమలు చేస్తున్న నిషేధం శతాబ్దాలుగా వారిపై కొనసాగుతున్న వివక్షకు ప్రతిరూపమని అన్నారు. ఇంతటితో ఈ సమస్యకు పుల్‌స్టాప్‌ పెట్టి అయ్యప్ప దర్శనం చేసుకునే మహిళలకు స్వాగతం కల్పించేందుకు ఆలయ ధర్మకర్తల మండలి చురుకుగా ఏర్పాట్లు చేయాలి. వారిని తమ మాతృమూర్తులగా స్వామి దగ్గరకు చేర్చాలి. అప్పుడే మన సంస్కృతిని గౌరవించుకున్న వారం అవుతాం. అందుకే ఈ తీర్పును మహిళా హక్కుల నేతలు స్వాగతించారు.

Other News

Comments are closed.