శాస్త్రవేత్తను అనవసరంగా వేధించారు

share on facebook


– అతనికి రూ.50 లక్షలు చెల్లించండి
– గూఢచర్యం కేసులో ఇస్రో మాజీ శాస్త్రవేత్తకు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి) : గూఢచర్యం కేసులో ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణన్‌ (76)కు ఊరట లభించింది. కేరళ పోలీసులు ఆయనను అరెస్టు చేసి అనవసరంగా వేధింపులకు గురిచేశారని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు గాను ఆయనకు రూ.50 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆదేశించింది. కేరళ పోలీసులపై మాజీ శాస్త్రవేత్త చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ కమిటీని కూడా కోర్టు నియమించింది. 1994లో ఇస్రో గూఢచర్యం కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నించిన పోలీసు ఉన్నతాధికారులను విచారించాల్సిందిగా నారాయణన్‌ పెట్టుకున్న పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. 1994 అక్టోబర్‌ 20న మాల్దీవులకు చెందిన మహిళ మరియం రషీదాను పోలీసులు అరెస్టు చేశారు. గడువు ముగిసినప్పటికీ భారత్‌లో ఉంటున్నందుకు ఆమెను అరెస్ట్‌ చేయడంతోపాటు సెక్స్‌-స్పై కేసులో ఆమె ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ఆరోపణలు చేశారు. ఆమె శాస్త్రవేత్త నారాయణన్‌ పేరు చెప్పడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు మహిళలు, ఇస్రో మధ్య రషీదా మధ్యవర్తిత్వం నడిపిందని, ఇస్రోకు చెందిన క్రయోజెనిక్‌ రహస్యాలను సేకరించి వారికి చెప్పేదని పోలీసులు ఆరోపణలు చేశారు. ఆ రహస్యాలను వారు రష్యా, పాకిస్థాన్‌ ఐఎస్‌ఎస్‌లకు చేర్చేవారని చెప్పారు. అయితే రెండేళ్ల అనంతరం ఈ కేసును రాష్ట్ర పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్న సీబీఐ ఆ ఆరోపణలను కొట్టివేసింది. నంబీ నారాయణన్‌పై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొంటూ.. ఈ కేసును మూసివేస్తున్నట్లు సీబీఐ కోర్టులో నివేదిక సమర్పించింది. దీంతో వీరు 1996 మేలో విడుదలయ్యారు. ఈ కేసులో పోలీసులు అక్రమ మార్గాలను ఎంచుకున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ సిఫారసు చేసింది. అయితే ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో ఈ కేసు విచారణను తిరిగి చేపట్టారు. ఈ కేసులో కొత్తగా విచారణ చేపట్టాలని కేరళ పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని 1998లో సుప్రీంకోర్టు తప్పుబట్టింది. శాస్త్రవేత్త నారాయణన్‌ కూడా కేరళ హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే దీనిపై ప్రభుత్వం 2015లో హైకోర్టులో సవాల్‌ చేయగా, సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఆదేశాలను డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ తాజాగా నారాయణన్‌ సుప్రీం కోర్టుకు వెళ్లారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, పోలీసులు వేధింపులకు గురిచేశారని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం, ఈ కేసులో శాస్త్రవేత్తను అనవసరంగా వేధింపులకు గురిచేశారని పోలీసులపై మండిపడింది. ఆయనకు వెంటనే రూ.50 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Other News

Comments are closed.