సంక్షేమంలో ముందున్న సిఎం కెసిఆర్‌: ఎమ్మెల్యే

share on facebook

యాదాద్రి భువనగిరి,జనవరి18(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకంతో ఉత్తర తెలంగాణ సస్యశామలమవుతుందని అన్నారు. కాళేశ్వరంలో భాగంగా ఆలేరు నియోజకవర్గానికి కూడా గోదావరి జలాలు రానున్నాయని అన్నారు. ఏడాదికి ఈ పథకం పూర్తయి ఎస్సారేస్పీకి పునర్జీవం వస్తుందన్నారు. అందుకే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆకర్షితులై అనేకమంది గులాబీ కండువా కప్పుకుంటున్నారని అన్నారు. ప్రతి కార్మికుడికి ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని, డబుల్‌బెడ్‌రూం ఇల్లు, సంక్షేమ పథకాలల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ఇచ్చారు. శ్రీరాంసాగర్‌ రివర్స్‌ పంపింగ్‌తో రైతాంగానికి భరోసా కలుగుతుందని అన్నారు. కాంగ్రెస్‌, టిడిపిల వల్ల వట్టిపోయిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పునరుజ్జీవ పథకంతో ప్రాణం వస్తుందన్నారు. బంగారు తెలంగాణ సాధించే క్రమంలో రాష్ట్ర రైతాంగం కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్‌ ఆలోచనల్లోంచి పుట్టుకు వచ్చిన పథకమే ఇదన్నారు. పేదల ఆకలి దప్పిక తెలిసిన మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, కూడు, గూడు, గుడ్డ, ఆకలి కోసం పోరాటం చేసే కమ్యూనిస్టు సిద్ధాంతం తరహాలోనే నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుకను ఒక్కటి చేసి పోరాడి రాష్ట్రం సాధించిన పెద్ద కమ్యూనిస్టు అని అన్నారు. పేదలు, అభాగ్యులు, ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, నిర్వాసితులు, వికలాంగులను ఆదుకోవడం ఎజెండాగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతోందన్నారు.

Other News

Comments are closed.