సంబరాలు అంబరాన్నంటాలి

share on facebook

– బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలి
– నగరంలోని 14 ప్రధాన ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తాం
– భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దు
– బోనాల పండుగకు ఏర్పాట్లపై సవిూక్షలో మంత్రి ఇంధ్రకరణ్‌రెడ్డి
హైదరాబాద్‌, జులై12(జ‌నం సాక్షి) : బోనాల పండుగ సంబరాలను అంబరాన్నంటేటా నిర్వహిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం బొగ్గులకుంటలోని ధార్మిక భవన్‌ లో బోనాల నిర్వహణ పై దేవాదాయశాఖ అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సవిూక్ష సమావేశానికి దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శివశంకర్‌, అదనపు కమిషనర్‌ శ్రీనివాస రావు, హైదరాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ రామకృష్ణ, నగర సహాయక కమిషనర్లు, వివిధ ఆలయాల కార్య నిర్వహణ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండేలా అమ్మవారి అనుగ్రహం ఉండాలన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగ నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా బోనాల ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా అంబరాన్ని అంటేలా బోనాల సంబరాలను జరుపుకునేలా అన్నిశాఖల అధికారుల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ నగరంలోని 14 ప్రధాన ఆలయాలకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తామన్నారు. బోనాలు జరిగే అన్ని దేవాలయాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించాలని, రహదారులను శుభ్రంగా ఉండేలా చూడాలని, మంచినీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. విజయవంతంగా బోనాల ఉత్సవాలను నిర్వహించాలన్నారు. బోనాల పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని భక్తులకు సూచించారు. గంగ, జమున, తెహజీబ్‌ సంస్కృతికి నిలయమైన హైదరాబాద్‌ నగరంలో అందరూ ప్రశాంతంగా బోనాలు నిర్వహించుకుని, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ నెల 15న గోల్కొండ జగదాంబ మహాంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.. ఉజ్జయిని మహంకాళి దేవాలయం సికింద్రబాద్‌ వద్ద జూలై 29 న బోనాలు, జూలై 30 న రంగము మరియు ఏనుగు ఊరేగింపు నిర్వహిస్తారు. హైదరాబాద్‌ లాల్‌ దర్వాజ మహంకాళి
అమ్మవారికి ఆగష్టు 5 న బోనాల పండుగను, ఆ మరుసటి రోజు బోనాల ఊరేగింపును నిర్వహిస్తామని తెలిపారు.

Other News

Comments are closed.