సర్కారీ దవాఖానాల్లో సుఖ ప్రసవాల తగ్గుదల?

share on facebook

వరంగల్‌,మే17(జ‌నం సాక్షి): ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు అధికంగా జరుగుతున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఎలా ఉన్నా, సర్కార్‌ దవాఖానాల్లోనూ ఇలాంటి ప్రసవాలపై ఆందోళన కలుగుతోంది. అవసరం లేకున్నా వైద్యులు ఎడాపెడా శస్త్ర చికిత్సలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.సర్కార్‌ ఆస్పత్రుల్లో సిజేరియన్ల కారణంగా మామూలు కాన్పులకు చోటులేకుండా పోతోంది.  గతేడాది జరిగిన  ప్రసవాల్లో 65 శాతం వరకు శస్త్రచికిత్సలు జరిగినట్లు  వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రసవం కోసం ఆస్పత్రికి వస్తే చాలు.. తల్లీబిడ్డ క్షేమంగా ఉండాలంటే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఇద్దరి ఆరోగ్యం క్షేమంగా ఉండాలనే ఆలోచనతో అందుకు ఒప్పుకుంటున్నారు. భవిష్యత్తులో మహిళల సాధారణ జీవితంపై ప్రభావం పడుతుందని ఆలోచించడం లేదు.    ప్రభుత్వ ఆసుపత్రులూ ఇదే బాట పట్టడం ఆవేదన కలిగిస్తోంది.మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ ఆస్పత్రిలో కూడా సిజేరియన్లకే ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. ఒకప్పుడు సుఖప్రసవాల సంఖ్య అధికంగా ఉండగా పరిస్థితి తారుమారు అయింది. సుఖ ప్రసవం చేయాలని వైద్యులు గంటల కొద్దీ వేచి ఉండే వారు. ఇప్పుడు అరగంట కూడా కేటాయించలేక శస్త్రచికిత్సలు చేసేస్తున్నారు. కొందరు విధుల నిర్వహణ సమయం ముగియగానే ఇంటి వద్ద సొంత దవాఖానాల్లో పని చేస్తున్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రజారోగ్య విధానాల్లో పలు సంస్కరణలు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా సర్కారీ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది.  12 వేలతో పాటు ‘కేసీఆర్‌ కిట్టు’ను ఇస్తోంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సిజేరియన్ల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంలో వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణ, పరిశీలన ఎంతో అవసరం అని భావిస్తున్నారు. అయితే ఇలాంటి విపరీత పోకడలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని  జిల్లా వైద్యాఆరోగ్యశాఖ అన్నారు. 
…………………….

Other News

Comments are closed.