సాగర్‌కు పెరిగిన నీటిమట్టం

share on facebook

నల్లగొండ,ఆగస్ట్‌21(జ‌నం సాక్షి): జిల్లావ్యాప్తంగా వర్ష కురవడంతో ప్రజలు ఇబ్బందికి లోనయ్యారు. అయితే సాగర్‌కు ఇన్‌ఫ్లో వల్ల భారీగా వరదనీరు చేరుతోంది. జిల్లా కేంద్రంలో ఉదయం ముసురుతో ప్రారంభమై సాయంత్రానికి మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పలు లోతట్టు కాలనీలు జలమయం కాగా వరద పొటెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురవగా మిర్యాలగూడ పట్టణంలో మోస్తరు వర్షం పడటంతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. నాగార్జునసాగర్‌ ఆయకట్టు రైతులు వానాకాలం పంటలకు విడుదల చేస్తున్న నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సాగర్‌ ఆయకట్టు రైతులకు నీటి వినియోగంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పది రోజులుగా కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పైన ఉన్న ప్రాజెక్టులు నిండి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. వరద ఉధృతి ఇలాగే కొనసాగితే సాగర్‌ ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉందన్నారు. రైతుల ప్రయోజనం కోసమే ప్రభుత్వం ఆన్‌ అండ్‌ ఆఫ్‌ పద్ధతిలో నీటి విడుదల చేస్తుందన్నారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తేనే యాసంగి పంటలకు కూడా నీటి విడుదల సాధ్యపడుతుందన్నారు. ఎన్‌ఎస్‌పీ అధికారులు చివరి భూముల వరకు సాగునీరు అందించే విధంగా కృషి చేయాలని సూచించారు. సాగర్‌ ఆయకట్టు పరిధిలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ, మోటార్ల ఆపరేటింగ్‌ విషయంపై ఎన్‌ఎస్‌పీ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వాని అందించాలని సూచించారు.

 

Other News

Comments are closed.