సాధ్విపై ఇసి తీరు సరిగా లేదు

share on facebook

ఆమెపై ఎందుకు చర్యలు తీసుకోరు: మాయావతి
లక్నో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): భోపాల్‌ భాజపా అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ చేస్తున్న వ్యాఖ్యలపై బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి అభ్యంతరాలు తెలిపారు. ఆమెపై కేంద్ర ఎన్నికల సంఘం కనబర్చుతున్న ధోరణిపై విమర్శలు గుప్పించారు. ‘భోపాల్‌ భాజపా అభ్యర్థి, మాలెగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌.. తాను ధర్మయుద్ధంలో పాల్గొంటున్నానని వ్యాఖ్యలు చేశారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నిజస్వరూపం ఇదే. ఈ విషయం తరుచూ బహిర్గతం అవుతోంది. అయినప్పటికీ, సాధ్వి ప్రజ్ఞాసింగ్‌కు ఎన్నికల సంఘం నోటీసులు మాత్రమే ఎందుకు ఇస్తోంది? ఆమె అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయట్లేదు?’ అని ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు. కాగా, మాలెగావ్‌ పేలుళ్ల
కేసులో తనను చిత్రహింసలకు గురిచేసినందున ఐపీఎస్‌ అధికారి హేమంత్‌ కర్కరే సర్వనాశనమైపోతాడని తాను శపించానని, అనంతరం ఆయన మృతి చెందారని ఇటీవల సాధ్వి ప్రజ్ఞా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసి, నోటీసులు పంపింది. దీంతో ఆమె క్షమాపణలు చెప్పారు. మరోవైపు, ఎన్నికల సంఘ స్థాయి దిగజారిపోతోందని మాయావతి ఆరోపణలు చేశారు. ‘ఎన్నికల సంఘం సరైన రీతిలో పనిచేయకపోతే ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఈసీ స్థాయి పడిపోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీదే బాధ్యత’ అని మరో ట్వీట్‌ చేశారు.

Other News

Comments are closed.