సామాజిక ఉద్యమంగా మొక్కల పెంపకం సాగాలి

share on facebook

ఇటీవలే అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం అంటూ ప్రతినబూనాం. మొక్కలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చాం. ఈ దశలో క్షేత్రస్థాయిలోనే మొక్కల పెంపకాన్ని బాధ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. గ్రామాల్లో దీన్నో ఉద్యమంగా తీసుకుని పోవాలి. మొక్కలను నాటడం పరిరక్షించడం అన్నది నిత్యపాఠం కావాలి. ఇకపోతే పాఠశాలస్తాయిలో పర్యావరణం, మొక్కలు నాటడం పాఠ్యాంశం కావాలి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో మొక్కల పెంపకానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నా ప్రజల భాగస్వామ్యం లేకుండా దీనిని ముందుకు తీసుకుని వెళ్లలేం. అందుకే పాఠశాల స్తాయిలో విద్యార్థులను ఇందుకుసన్నద్దం చేస్తే మంచిది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ జరగాలి. ఇది నిరంతర కార్యక్రమంలా సాగాలి. ఇందులో పాల్గొనే విద్యార్థులకు ప్రత్యేక మార్కులు కేటాయించడం లాంటివి చేయాలి. గ్రామాల్లో సర్పంచ్‌లు కేంద్రంగా హరిత ఉద్యమం సాగేలా చొరవ తీసుకోవాలి. ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా మానేసేలా చర్యలు తీసుకుంటూనే మొక్కల పెంపకాన్ని ఉద్యమంగా తీసుకుని వెళ్లగలిగితే భవిష్యత్‌ తరాలు మనుగడ సాగించగలవు. /ూహ్లాదభరిత హరితావరణ శోభలు వెల్లివిరియడానికి వృక్షసంపదే మూలాధారం. ఆ స్ఫూర్తికి మొక్కవోని కట్టుబాటు చాటుతూ ఉభయ తెలుగు రాష్టాల్లోన్రూ హరిత సంరక్షణోద్యమం సాగుతోంది. ఏటా మొక్కలు నాటే కార్యాచరణతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారు ముందడుగు వేస్తోంది. నాలుగోవిడత ‘హరితహారం’లో భాగంగా తెలంగాణ అంతటా సుమారు 30 కోట్ల మొక్కలు నాటించడానికి కేసీఆర్‌ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పేర్లలో భిన్నత్వమే తప్ప ‘వనం-మనం’, ‘హరితహారం’ వెనక సామాజిక ఉద్యమ స్ఫూర్తి ప్రస్ఫుటమవుతోంది. 23 శాతానికి పరిమితమైన అటవీ విస్తీర్ణాన్ని 2024 నాటికి 50 శాతమయ్యేలా ప్రతి పౌరుడూ ముందుకు సాగాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టారుఏటా అయిదు నుంచి పది మొక్కలు నాటితే హరితాంధప్రదేశ్‌ అవతరిస్తుందన్నది ‘వనం-మనం’ ఉద్యమ నినాదం. మూడేళ్లలో 230 కోట్ల మొక్కల పథకం అమలును ఉరకలెత్తించి తెలంగాణకు పచ్చలహారం అమర్చాలన్నది ‘హరితహారం’ లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొక్కల పరిరక్షణకు సంబంధించి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమనడంలో భిన్నాభి ప్రాయం లేదు. అధికార యంత్రాంగం గాడి తప్పకుండా ప్రజాప్రతినిధులూ తమవంతు క్రియాశీల పాత్రపోషిస్తేనే మొక్కల పెంపక లక్ష్యం సాకారం కాగలదు. మొక్కలు నాటేందుకు విద్యార్థులు, సామాన్య పౌరులు, అధికారులు, అమాత్యులు, యావత్‌ ప్రజా ప్రతినిధులు కూడి రావాలని కేసీఆర్‌ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో ఏటా హరితహారం సాగుతోంది. అప్పట్లో ఖాళీ స్థలాలు, పోరంబోకు భూముల్లో నాటిన మొక్కల్లో ఇంచుమించు సగమే బతికినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి నాటుతున్న మొక్కల రక్షణ కోసం ఇతోధిక జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు సూటిగా తెలియ జెబుతున్నాయి. నాటిన మొక్కల్ని సంరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అధికారుల ఉదాసీనత, పరోక్ష సహకారాలతో ఏటా చెట్లు అంతరించి పోతున్నాయి. తెలుగునాట అరణ్యఘోషను కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ నివేదిక బట్టబయలు చేసింది. అందువల్ల మొక్కల పరిరక్షణలో రాణించినవారికి ప్రోత్సాహకాల ప్రదానంతోపాటు చెట్ల నరికివేతకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించేందుకు వెనకాడరాదు. గత వైఫల్యలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఇనుమడించిన పట్టుదలతో పచ్చదనం పెంపొందించడానికి ఇరు ప్రభుత్వాలూ ఉద్యుక్తం కావాలి. వాతావరణాన్ని చల్లబరచడంలో,భూక్షయాన్ని నివారించడంలో చెట్ల పాత్ర, ప్రాముఖ్యం అనుపమానమైనవి. ఒక్కో చెట్టూ ఏటా పాతిక కిలోల సారవంతమైన నేల గాలివానకు కొట్టుకుపోకుండా అడ్డుకొంటుంది. అందుకే చెట్టూ చేమా ఉంటేనే పర్యావరణ సమతూకానికి, ప్రకృతిలో పచ్చదనానికి భరోసా ఏర్పడుతుంది. దురదృష్టవశాత్తు దేశంలో అనుదినం 20వేల హెక్టార్ల మేర అడవులు నాశనమై, వాతావరణ కాలుష్యం పెచ్చరిల్లుతోంది. దీంతో దేశంలో రోజూ లక్షమందివరకు నిస్సహాయంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. వాయుకాలుష్య పీడను విరగడ చేసి ఆరోగ్యకర సమాజాన్ని అవతరింపజేసే లక్ష్యంతో మొక్కల పెంపకం సామాజిక ఉద్యమం స్థాయికి ఎదగాల్సి ఉంది. వనసౌభాగ్యం జనానికి జీవనాడి అవుతుంది. ఇదేదో ప్రభుత్వాల ప్రాయోజిత పథకాల్లా కాకుండా మన బాథధ్యతగా పౌరులు ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. అలాగైతేనే నాటిన మొక్కల్ని కంటికి రెప్పలా కాపాడుకునే జవాబుదారీతనం నెలకొంటుంది. విచ్చలవిడిగా చెట్ల నరికివేతను నిరోధించేలా బాధ్యతా తీసుకోవాలి. మొక్కలు నాటే మహాయజ్ఞం ఏ దశలోనూ మొక్కుబడి కార్యక్రమంగా కాకూకుండా ఉద్యమస్ఫూర్తి వెల్లివిరియజేసే పటిష్ఠ కార్యాచరణతోనే, హరిత సంకల్పదీక్షకు పూనుకోవాలి. ఇకపోతే తెలంగాణ పాఠశాలలకు డిప్యూటి సిఎం మొక్కల పెంపకంపై బాధ్యతలను అప్పగించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం పాఠశాలల్లో నిత్య పాఠ్యాంశం కావాలని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అభిలషించారు. ఇది విద్యార్థి,ఉపాధ్యాయులకు తప్పనిసరి కావాలని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కల పెంపకం జీవితంలో భాగం కావాలన్నారు. మొక్కలు పెంచడంలో ప్రైవేట్‌,ప్రభుత్వ పాఠశాలలు అన్న తేడా లేకుండా అందరూ భాగస్వాములు కావాలన్నారు. నాటిన మొక్కలు పెరిగి పెద్దవైతే మానవాళి మనుగడకు దోహదపడతాయని,భవిష్యత్‌కు నీడనిస్తాయని అన్నారు. ఈ సూత్రం ఆధారం/-గా టీచర్లు పిల్లను తర్ఫీదు చేయాలన్నారు. మొక్కల పెంపకం ఆవశ్యకతలను ప్రతి పాఠశాలలో వివరించాలి. ఏ విధంగా నాటాలి, వాటికి నీరు ఏ విధంగా పోస్తే చక్కగా పెరుగుతాయో వారికి విశదీకరించాల్సి ఉంది.

 

Other News

Comments are closed.