స్తంభించిన జనజీవనం

share on facebook

– దేశవ్యాప్త బంద్‌తో నిలిచిపోయిన వాహనాలు
– తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణంగా బంద్‌
– తెల్లవారుజామునుంచే రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్‌, వామపక్షాలనేతలు
– డిపోలు, బస్టాండ్‌ల వద్ద  బైఠాయించిన కార్యకర్తలు
– కేంద్రం తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు
– పలు ప్రాంతాల్లో మోడీ దిష్టిబొమ్మలు దహనం
– పలు ప్రాంతాల్లో ఎండ్లబండ్లపై ర్యాలీలు నిర్వహించి నిరసన
హైదరాబాద్‌, సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి) : దేశవ్యాప్తంగా రోజురోజుకు ఆకాశమే హద్దుగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యపు విధానాన్ని ఎండగడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన బంద్‌ సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణంగా సాగింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసిస్తూ కాంగ్రెస్‌ సహా విపక్షాలు ఈ బంద్‌లో పాల్గొన్నాయి.
విజయవాడలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్‌ బంద్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌, జనసేన పార్టీలు పాల్గొన్నాయి. ధరలను నిరసిస్తూ విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఆందోళన చేపట్టాయి. అక్కడ ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.
అదేవిధంగా అనంతరంపురం జిల్లాలో బంద్‌ సంపూర్ణగా సాగింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్‌, జనసేన, వామపక్షాలు నిరసన చేపట్టాయి.  ఉదయాన్నే రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. కళాశాలలు, పాఠశాలలు మూయించి వేశారు. ఈ సందర్భంగా రహదారులు నిర్మానుషంగా మారాయి. ఉదయాన్నే రోడ్లపై భారీ ర్యాలీలు నిర్వహించిన విపక్షాల నేతలు కేంద్రం తీరుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
– చిత్తూరు జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా సాగింది.. పలు ప్రాంతాల్లో భారత్‌ బంద్‌ సందర్భంగా సీపీఐ,సీపీఎమ్‌, జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బంద్‌ కారణంగా బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. పెట్రోల్‌ డీజల్‌ ధరల పెంపును నిరసిస్తూ మదనపల్లిలో వామపక్షాలు, జనసేన ,కాంగ్రెస్‌ పార్టీల ఆధ్వర్యంలో బంద్‌ కొనసాగింది. బంద్‌కు మద్దతుగా పలు ప్రైవేట్‌ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవులు ప్రకటించాయి. కాగా తెల్లవారుజామునే రోడ్లపైకి వచ్చిన కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న ధరలతో దేశ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారని, సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అయిన ప్రభుత్వం ఎలాంటి చలనంలేకుండా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్‌ ధరల పెంపును తగ్గించకుంటే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
– గుంటూరులో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది..  పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్‌, జనసేన, వామపక్షాలు బంద్‌ చేపట్టాయి. గుంటూరు, వినుకొండ, నరసరావుపేట, రేపల్లె, సత్తెనపల్లి బస్టాండ్‌ వద్ద ఆందోళనకారులు బైఠాయించారు. తెల్లవారు జామునుండే డిపోలు, బస్టాండ్‌ల వద్ద బైఠాయించడంతో ఆర్టీసీ బస్సులు బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇదిలా ఉంటే కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌, వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. కేంద్రం తీరుమార్చుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
– కృష్ణాజిల్లాలో బంద్‌ సంపూర్ణంగా ముగిసింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు నిరసనగా చేపట్టిన దేశవ్యాప్త బంద్‌ లో భాగంగా కృష్ణాజిల్లాలోని తిరువూరు, జగ్గయ్యపేట, తదితర ప్రధాన ప్రాంతాల్లో బంద్‌ ప్రశాంతంగా సాగింది. బంద్‌ సందసర్భంగా కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు తెల్లవారు జామునే రోడ్లపైకి వచ్చి బస్‌ డిపోలు, ఆర్టీసీ బస్టాండ్‌ల వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. బస్సులను అడ్డుకున్న కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం కార్యకర్తలు, నాయకులు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా పలు ఆర్టీసీ అధికారులు బస్సులను తిప్పారు.
– కర్నూల్‌ జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా సాగింది. పెరుగుతున్న పెట్రోల్‌, డీజల్‌ ధరలను వ్యతిరేకిస్తూ డోన్‌లో సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో తెల్లవారు జామున 4 గంటలకే బంద్‌ ప్రభావం మొదలైంది. ఆర్టీసీ డిపో ముందు బైఠాయించిన ఆందోళనకారులు బస్సులు బైటికి రాకుండా అడ్డుకున్నారు. కర్నూలు నగరంలో సైతం పెంచిన పెట్రో ధరలకు నిరసనగా ఆర్టీసీ బస్‌స్టాండ్‌ వద్ద  వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. డిపో వద్ద బస్సులను ఆందోళనకారులు అడ్డుకున్నారు.
– ప్రకాశం జిల్లాలోనూ బంద్‌ ప్రభావం కనిపించింది. జిల్లాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు పెంపునకు నిరసనగా తెల్లవారు జామునుండే కాంగ్రెస్‌ కార్యకర్తలు రోడ్లపైకొచ్చారు. ఈ సందర్భంగా డిపోలు, బస్టాండ్‌ల వద్ద బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. బంద్‌లో భాగంగా ఒంగోలు ఆర్టీ బస్టాండ్‌ ఎదుట వామపక్షాలు, కాంగ్రెస్‌, జనసేన పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీల కార్యకర్తలు బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు.
– కడప జిల్లాలో పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాలతో పాటు పలు పార్టీలు భారత్‌ బంద్‌లో పాల్గొన్నాయి. కడప ఆర్టీసీ బస్టాండ్‌ గేట్‌ వద్ద వామపక్షాల నేతలు భైఠాయించారు. బంద్‌లో కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు.
– విజయనగరంలో పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ బంద్‌ ప్రశాంతంగా సాగింది.  బంద్‌లో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌, వామపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆర్టీసీ  బస్సులు యధావిధిగా తిరిగాయి.
– పశ్చిమ గోదావరి జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా సాగింది.. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను నిరసిస్తూ వామపక్షాలు, జనసేన పార్టీల ఆధ్వర్యంలో  బంద్‌ కొనసాగింది. ఏలూరు కొత్త బస్టాండ్‌ వద్ద తెల్లవారుజాము నుంచి బంద్‌ మొదలైంది. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిరసన తెలుపుతున్న ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. నర్సాపురంలో పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలకు నిరసనగా సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, జనసేన నాయకులు, కార్యకర్తలు నర్సాపురం ఆర్టీసీ డిపోను ముట్టడించారు.
– శ్రీకాకుళం జిల్లాలో.. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపునకు  నిరసనగా శ్రీకాకుళం, టెక్కలి, పలాస, పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్‌ల వద్ద వామపక్షాల కార్యకర్తలు బస్సులను అడ్డుకున్నారు. బస్సులు ఎక్కడికి కదలలేక డిపోలకే పరిమితమయ్యాయి.  దీంతో వామపక్షాల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని స్టేషనుకు తరలించారు.
– కరీంనగర్‌లో  పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు బస్టాండ్‌ వద్ద బైఠాయించారు. తెల్లవారుజామునే డిపోలు, బస్టాండ్‌ల వద్దకు చేరుకున్న కాంగ్రెస్‌, వామపక్ష నేతలు బస్టాండ్‌ నుంచి బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్‌ కృష్ణన్‌, టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్‌, డీసీపీ అధ్యక్షులు మృత్యుంజయంలతో పాటు పలువురు రోడ్లపై బైఠాయించి వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళల కారులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌లకు తరలించారు.  పోలీసుల తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ కార్యకర్తలు రోడ్లపై వాహన ర్యాలీ నిర్వహించారు. పెట్రో, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి నియంత్రణలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.
– నల్గొండ జిల్లాలో బంద్‌ సంపూర్ణం సాగింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ చేపట్టిన
భారత్‌ బంద్‌లో కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నాయి. తెల్లవారు జామునే బస్‌ డిపోలు, బస్టాండ్‌ల ఎదుట బైటాయించి ఆందోళనలకు దిగారు. నల్గొండ బస్‌ డిపోలో వామపక్షాల నాయకులు బైఠాయింపుతో బస్సుల రోకపోకలు  పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇదిలా ఉంటే రోడ్లపై ర్యాలీలు నిర్వహిస్తూ కాంగ్రెస్‌, వామపక్ష నేతలు, కార్యకర్తలు దుకాణాలు, ¬టళ్లను మూయించి వేశారు. బంద్‌ సందర్భంగా ర్యాలీలు నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
– రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా సాగింది.. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ చేపట్టిన భారత్‌ బంద్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. బంద్‌లో భాగంగా వేములవాడ ఆర్టీసీ డిపో ముందు ఆది శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు.
– మేడ్చల్‌ జిల్లాలో బంద్‌ సంపూర్ణంగా సాగింది.. పెట్రోల్‌,డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ నాయకులు కుత్బుల్లాపూర్‌ జీడిమెట్ల బస్‌ డీపో వద్ద బైఠాయించారు. డిపో నుంచి బస్సులను బయటకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ బంద్‌లో కూన శ్రీశైలం గౌడ్‌ పాల్గొన్నారు.
– ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంబగా బంద్‌ ప్రశాంతంగా సాగింది. తెల్లవారు జామునుంచే కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు రోడ్లపైకి వచ్చి తమ నిరసను తెలియజేశారు. బస్సు డిపోలు, బస్టాండ్‌ల వద్ద బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ఖమ్మం, ఇల్లందు, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు, సింగరేణి తదితర ప్రాంతాల్లో బంద్‌ సంపూర్ణంగా సాగింది. బంద్‌ సందర్భంగా సింగరేణి కార్మికులు విధులను బహిష్కరించారు. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం పట్టణ కేంద్రంలో కాంగ్రెస్‌, వామపక్షాల నేతల ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం నిర్లక్ష్యం దోరణిని వ్యవరిస్తుందన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నా తమకేవిూ పట్టనట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడిజిల్లలోని పలు ప్రాంతాల్లో మోదీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఖమ్మం, ఇల్లందుల్లో రహదారిపై బైఠాయించిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
– మహబూబ్‌ నగర్‌ ఉమ్మడి జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా సాగింది. ఉమ్మడి జిల్లాలోని గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రాల్లోని బస్‌ డిపోలు, బస్టాండ్‌ల వద్ద కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలనేతలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. దీంతో బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేటలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపు మేరకు తేల్లావారు జామున 5 గంటల నుంచి అఖిలపక్ష నాయకులు  బస్‌ డిపో ముందు బైఠాయించారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవటంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ ఎమ్‌ఎల్‌, పీడీఎస్‌యూ, పీవైఎల్‌, వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. భారత్‌ బంద్‌  సందర్భంగా పెట్రోల్‌ ధరలను నిరసిస్తూ వామపక్షాలు  తాండూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భైఠాయించాయి.
మోడీ, కేసీఆర్‌ ప్రజల రక్తం తాగుతున్నారు – పీసీసీచీఫ్‌ ఉత్తమ్‌
పెట్రో ధరలు పెంచి ప్రధాని నరేంద్ర మోడీ జనాన్ని పీల్చుకు తింటుంటే… పన్నులు మోపి కేసీఆర్‌ ప్రజల రక్తం తాగుతున్నారని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మడిపడ్డారు. సోమవారం దేశవ్యాప్త బంద్‌లో బాగంగా ఉత్తమ్‌ హైదరాబాద్‌లో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌ బంద్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌ విజయవంతంగా సాగుతోంని, ఉదయం నుంచే కాంగ్రెస్‌
నేతలు, కార్యకర్తలు బస్‌ డిపోల దగ్గర ధర్నాలు చేస్తూ… బంద్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అడ్డగోలుగా పెంచుతుండడంతో ప్రజలు పాలకుల పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. వివిధ ప్రాంతాల్లో బంద్‌ సందర్భంగా అక్రమ అరెస్టులను ఉత్తమ్‌ తీవ్రంగా ఖండించిన. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఎక్కడాలేని విధంగా పెట్రోల్‌ పై 35.5 శాతం, డీజిల్‌ పై 27 శాతం పన్ను వేస్తున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో లేనంత పన్ను తెలంగాణలో ఉందని, ఆపద్ధర్మ పాలనలోనూ నియంతృత్వమే నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఈ  పాలకులకు తగిన బుద్ధి చెబుతారని ఉత్తమ్‌ హెచ్చరించారు.

Other News

Comments are closed.