స్వగ్రామానికి చేరిన శరత్‌ మృతదేహం

share on facebook

– బంధువుల ఆర్తనాధాలతో గ్రామంలో విషాద ఛాయలు
– మృతదేహానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం కడియం
– కడసారి చూసేందుకు తరలివచ్చిన పరిసర ప్రాంతాల వాసులు
– అశ్రు నయనాల మధ్య శరత్‌ మృతదేహానికి అంత్యక్రియలు
కరీంనగర్‌, జులై12(జ‌నం సాక్షి) : అమెరికాలో దుండగుడి చేతిలో కాల్పులకు గురై మరణించిన తెలుగు విద్యార్థి కొప్పు శరత్‌ మృతదేహం గురువారం ఉదయం స్వగ్రామమైన వరంగల్‌ నగరంలోని కరిమాబాద్‌కు చేరుకుంది. శరత్‌ మృతదేహాన్ని చూసిన వెంటనే కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శరత్‌ను కడసారి చూసేందుకు గ్రామస్థులు, స్నేహితులు తరలివస్తున్నారు. గ్రామస్థులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, బంధు, మిత్రులు శరత్‌ను కడసారి చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాథాలతో  గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇదిలా ఉంటే శరత్‌ మృతదేహం బుధవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు, నరేందర్‌ రెడ్డి ఎయిర్‌పోర్టుకు చేరుకుని శరత్‌ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఘటన జరిగిన నాటి నుంచి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ శరత్‌ మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఎంపీ బండారు దత్తాత్రేయ ఎయిర్‌పోర్టుకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. విదేశాల్లోని తెలుగువారి భద్రతపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని.. ఈ మేరకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ హావిూ ఇచ్చారని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని దత్తాత్రేయ సూచించారు. శరత్‌ బంధువులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పించిన తర్వాత భౌతికకాయాన్ని వరంగల్‌ తరలించారు.
అమెరికాలోని కన్సాస్‌ నగరంలో ఒక రెస్టారెంటులో శుక్రవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో వరంగల్‌కు చెందిన శరత్‌ కొప్పుల (26) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. శరత్‌ ఆరు నెలల క్రితం మిస్సోరి విశ్వవిద్యాలయంలో ఎంఎస్‌ చేయడానికి అమెరికా వెళ్లాడు. శుక్రవారం రాత్రి 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10 గంటలకు) గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై కాల్పులు జరిపారు. శరత్‌పై కాల్పులు జరిగాయని, పరిస్థితి విషమంగా ఉందని అతడి స్నేహితుడు ఒకరు ఇక్కడి బంధువులకు సమాచారం అందించారు. శరత్‌ చనిపోయినట్లు శనివారం రాత్రి తెలంగాణ పోలీసులు తెలిపారని శరత్‌ బాబాయ్‌ ప్రసాద్‌ తెలిపారు. శరత్‌ స్వస్థలం వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌. తండ్రి రామ్మోహన్‌ హైదరాబాద్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగి. తల్లి మాలతి వరంగల్‌ గ్రావిూణ జిల్లా పర్వతగిరిలో
పంచాయతీరాజ్‌ శాఖలో ఈవోఆర్డీగా పనిచేస్తున్నారు. రామ్మోహన్‌ కుటుంబంతో హైదరాబాద్‌ అవిూర్‌పేటలోని ధరంకరం రోడ్డులో నివసిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన శరత్‌ హైదరాబాద్‌లోనే మూడేళ్లపాటు ఉద్యోగం చేశాడు. ఎంఎస్‌ చేసేందుకు ఆరు నెలల కిందట అమెరికా వెళ్లాడు. మిస్సోరి యూనివర్సిటీలో చదువుకుంటూనే కన్సాస్‌ నగరం ప్రాస్పెక్ట్స్‌ అవెన్యూలోని జేఎస్‌ ఫిష్‌ అండ్‌ చికెన్‌ మార్కెట్‌ అనే ఓ ¬టల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
నివాళులర్పించిన డిప్యూటీ సీఎం కడియం..
కరీమాబాద్‌లోని తన నివాసంలో ఉంచి శరత్‌ మృతదేహాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబం సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా ఎమ్మెల్యే కొండా సురేష్‌, ఇతర ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మృతదేహాం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. అదేవిధంగా గురువారం సాయంత్రం అశ్రునయనాల మధ్య శరత్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. శరత్‌ మృతదేహాన్ని కడసారి చూసేందుకు గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు బారీ సంఖ్యలో తరలివచ్చారు. తల్లిదండ్రులు, బంధువుమిత్రులతో రోధనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలముకున్నాయి.

Other News

Comments are closed.