హరితహారంపై గ్రామాల్లో ప్రచారం

share on facebook

అడవులను పెంచేలా చైతన్యం

నాలుగో విడతకు సిద్దం అవుతున్న అధికారులు

జనగామ,జూలై11(జ‌నం సాక్షి): జిల్లాలో కేవలం ఒక్క శాతానికి పరిమితమైన అటవీ విస్తీర్ణాన్ని 25శాతానికి పెంచే లక్ష్యంతో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మొక్కలను విరివిగా పెంచి కరువును పారదోలాలనే దృఢనిశ్చయంతో ముందుకు సాగుతోంది. జిల్లాలో 66నర్సరీలు ఉండగా ఎప్పటికప్పుడు రకరకాల మొక్కలు పెంచుతున్నారు. సుమారు 19 రకాల మొక్కలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలురూపొందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో భాగంగా మొదటి విడత హరితహారం కార్యక్రమాన్ని ఓ యజ్ఞంలా నిర్వహించారు. ప్రభుత్వ రంగంలోని అన్నిశాఖలు సమన్వయం చేసుకుని పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. మొదటి విడత సుమారు 67లక్షల మొక్కలు నాటారు. ప్రధానంగా అటవీశాఖ, డీఆర్‌డీఏ, డ్వామా, హార్టికల్చర్‌, ఎక్సైజ్‌, పోలీస్‌శాఖలు ప్రధాన భూమిక పోషించాయి. ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధి కారులు ఆయా శాఖలతో సవిూక్షలు నిర్వహిస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేవలం ఒకశాతం అటవీ ప్రాంతం కలిగి కరువు గడ్డగా ఉన్న జనగామలో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు అధికారులు కృషి చేశారు. మొక్కల సంరక్షణకు గానూ ట్రీగార్డ్స్‌, గ్రీన్‌ బ్రిగేడ్స్‌ను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో నాటిన మొక్కల్లో మూడో వంతు బతికినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నాలుగో విడత పెద్దసంఖ్యలో మొక్కలు నాటాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈ దఫా 87 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. అటవీ, డీఆర్‌డీఏ శాఖలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. రెండు రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాయి. ఆయా గ్రామాల్లో నిర్వహించే సమావేశాల్లోనూ హరితహారం ప్రస్తావన తెస్తూ మొక్కల పెంపకం వల్ల కలిగే లాభాలు వివరిస్తున్నారు. కరువు ప్రాంతమై న జనగామలో మొక్కలు పెంపకం ఆవశ్యకతను వివరిస్తున్నారు. మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు చేస్తున్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన విధానం ద్వారా కోటి విత్తన బంతులు చల్లారు. గుట్టలు, కొండలు, మైదాన ప్రాంతాల్లో విత్తన బంతులు వేశారు. చంపక్‌హిల్స్‌లో వేసిన విత్తన బంతులు మొలకెత్తిన దృష్ట్యా కాపాడేందుకు అధికార యంత్రాంగం

చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారి, పొలాల గట్లు, ప్రభుత్వ పాఠశాల ఆవరణలు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. జనగామ లాంటి కరువు ప్రాంతం లో చెట్ల ఆవశ్యకతను గుర్తిస్తూ ప్రతీ ఒక్కరు ఒక మొక్కను నాటాలని ప్రతిన బూనుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ పెంబర్తి గ్రామంలో పెద్దసంఖ్యలో మొక్కలు నాటాలని నిశ్చయించి దత్తత తీసుకుంది. గత ఏడాది అప్పటి కలెక్టర్‌ దేవసేన సీబ్‌బాల్‌ బాంబింగ్‌ అనే వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టారు. విత్తన బంతులను తయారు చేసి గుట్టలు, మైదాన ప్రాంతాల్లో వేశారు. ఫలితంగా మొక్కలు విరివిగా పెరిగాయి.

 

Other News

Comments are closed.