హరితహారంలో భాగస్వాములు కండి

share on facebook

సిఎం కెసిఆర్‌ లక్ష్యం కోసం పాటుపడదాం

ప్రజలకు ఎంపిల పిలుపు

కరీంనగర్‌,జూలై12(జ‌నం సాక్షి): తెలంగాణ ఉద్యమానికి రాష్ట్ర ప్రజలంతా కలిసి నడిచినట్లే హరిత తెలంగాణ సాధన కోసం నడుం బిగించాలని ఎంపిలు వినోద్‌, బాల్క సుమన్‌లు పిలుపునిచ్చారు. కరీంనగర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా అందరూ మొక్కలు నాటి సంఘీభావం ప్రకటించాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు హరిత తెలంగాణ కోసం అన్నివర్గాలు కలిసి రావాలని కోరారు. మూడు విడుతలు విజయవంతం చేసిన ప్రజలు నాలుగో విడత కూడా విజయవంతం చేయాలన్నారు. తెలంగాణలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడం కోసం సీఎం కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. మూడువిడుతల హరితహారంలో సుమారు 65 శాతం మొక్కలు బతికాయతీ /బిన్నారు. నాలుగోదశ హరితహారంలో పెద్దఎత్తున మొక్కలు నాటడం, సంరక్షించుకోవడం కోసం హరిత సైన్యాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రీ గార్డ్‌ల పంపిణీ, వంద మొక్కలకుపైగా పెంచిన వారికి మొక్కకు రూ.5 చొప్పున చెల్లించనున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా నగరంలో లక్ష మొక్కలు

నాటేందుకు వీలుగా గుంతలు తీయడం పూర్తి చేసి, వాటి వద్ద మొక్కలను సిద్ధంగా ఉంచారు. అందరి భాగస్వామ్యంతోనే హరితహారం విజయవంతం అవుతుందని ఎంపిలు అన్నారు. నాల్గోవిడత హరితహారంలో 40కోట్ల మొక్కలు నాటడం లక్ష్యం అన్నారు. డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్‌, వ్యవసాయశాఖ, అటవీశాఖలది హరితహారంలో కీలక బాధ్యత అని గుర్తు చేశారు. రైతులకు వ్యవసాయానికి అనుబంధం ఉన్న మొక్కలను పంపిణీ చేసి చేల గట్లపై నాటించే బాధ్యత వ్యవసాయశాఖదేనని చెప్పారు. గ్రామంలో ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి మొక్కలను నాటించే బాధ్యత పీఆర్‌ అధికారులపై ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్లతో హరితహారం ఆవశ్యకతపై అవగాహన కల్పించి ప్రతి ఇంటికి మొక్కలను పంపిణీ చేసి వారితో నాటించే బాధ్యత డీఆర్‌డీఏ శాఖ పై ఉందన్నారు. అటవీశాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా మొక్కలను నాటించి ఎవరికి ఏ మొక్కలు అవసరం ఉన్నాయో ఆ అవసరాన్ని బట్టి సమయానికి మొక్కలు సరఫరా చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వశాఖకు లక్ష్యం నిర్దేశించామని, ఆ లక్ష్యాన్ని మించి మొక్కలు నాటి హరితహారంలో తెలంగాణను ఆదర్శంగా నిలపాలని తెలిపారు. త్వరలో నాల్గోవిడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుందని, అందుకు అధికార యంత్రాంగం సమయత్తం కావాలని పిలుపునిచ్చారు.

 

Other News

Comments are closed.