హావిూ ఇవ్వని ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం

share on facebook

ఇచ్చిన మాటలన్నీ నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌
ఎక్కడా అమలు చేయని కార్యక్రమంలో తెలంగాణలో చేస్తున్నారు
కాంగ్రెస్‌ పాలనలో రైతులు అనేక అవస్థలు పడ్డారు..
ఇప్పుడు రైతు అవస్థ లేని రాజ్యం తెస్తున్నారు
చెక్కులు పంపిణీలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
వరంగల్‌,మే17(జ‌నం సాక్షి):  గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన హావిూలే నెరవేర్చకుంటే…తెలంగాణ ప్రభుత్వం హావిూ ఇవ్వని, మేనిఫెస్టోలో పెట్టని అనేక పథకాలు అమలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. టిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 9 గంటల పగటి పూట ఉచిత కరెంటు ఇస్తామని, రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన సిఎం కేసిఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నట్లుగానే లక్ష రూపాయల లోపు రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేశారన్నారు. దీనివల్ల 38 లక్షల మంది రైతులు రుణవిముక్తలయ్యారని, దీనికోసం 17 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. అదేవిధంగా 9గంటలు పగటి పూట ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి, వచ్చిన ఆరు నెలల్లోనే దీనిని అమలు చేశారన్నారు. ఆ తర్వాత రేషన్‌ ఇచ్చినట్లు వ్యవసాయానికి కరెంటు ఇవ్వడం మంచిది కాదని భావించి ఇప్పుడు 24 గంటల పాటు ఉచిత కరెంటు ఇస్తున్నారని, దేశంలో వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదన్నారు. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిరంతరం ఆలోచిస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.
రైతు బంధు కార్యక్రమంలో భాగంగా  జనగామా జిల్లా, గూడురులో రైతులకు చెక్కులు, పాస్‌ పుస్తకాలను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అందించారు. ఇందులో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. నాలుగేళ్ల కింద వ్యవసాయం దండగగా ఉందని, సరైన కరెంటు రాక, వచ్చిన ఆరు గంటల కరెంటు ఎప్పుడు వస్తుందో తెలవక, ఇచ్చిన కరెంటు వరుసగా ఇవ్వకపోవడంతో తడిసిన పొలమే తడవడం తప్ప కొత్త పొలానికి నీరు రాకపోయేది. ఫలితంగా ఎకరం పొలం పెడితే అర ఎకరం మాత్రమే పండి, దానిని అమ్మితే పెట్టిన పెట్టుబడి రాక, తెచ్చిన అప్పు తీరక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి కారణం కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా?’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు.  తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో 17వేల కోట్ల రూపాయలతో 38 లక్షల మంది రైతులను రుణ విముక్తులు చేశారు. రాత్రనక, పగలనక కరెంటు కోసం ఎదురు చూసే పరిస్థితిని మార్చి 24 గంటలు ఇంటి దగ్గర ఉండి పొలానికి నీరు ఇచ్చేలా కరెంటు సరఫరా చేస్తున్నారు సిఎం కేసిఆర్‌. గతంలో ఒక్క ఎరువు బస్తాకోసం రోజుల తరబడి ఎదురు చూసే పరిస్థితిని పూర్తిగా మార్చారు. ఎండాకాలంలోనే ఎరువులను, విత్తనాలను తెచ్చి స్టాక్‌ ఉంచుతూ అందుబాటులోకి తీసుకొచ్చారు. రైతు పొలం పండాలంటే నిండా నీరుండాలని సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. కాళేశ్వరం, దేవాదుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 3000 కోట్ల రూపాయలతో లింగంపల్లి ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇది పూర్తయితే పాలకుర్తి నెత్తివిూద నీటి నిండు కుండ ఉన్నట్లే ఉంటుందని, ప్రతి ఎకరా భూమిలో రెండు సార్లు పండించవచ్చు. 2018 జూన్‌ 2వ తేదీ నుంచి రైతు బీమా పథకం అమలు కానుంది. రైతు ఏ కారణం వల్ల అయినా చనిపోతే ఆయన కుటుంబం రోడ్డువిూద పడకుండా ఉండొద్దని ఆలోచించిన సిఎం కేసిఆర్‌ 5లక్షల
రూపాయలతో రైతుబీమా పథకాన్ని అమలు చేయనున్నారు. ఇటీవలే 800 కోట్ల రూపాయల నీటి తీరువా బకాయిలు మాఫీ చేశారు, ఇక నీటి తీరువాను రద్దు చేశారు. పంట పండిన తర్వాత మార్కెట్‌ కు తీసుకెళ్తే గిట్టుబాటు ధర రావడం లేదని, మండలానికొక గోదాం నిర్మించారు. దీనిలో పంటను నిల్వ చేసుకోవడం, నిల్వ చేసుకున్న పంటకు 90 శాతం బ్యాంకు రుణం కూడా ఇవ్వనున్నారు. పంటకు సరైన ధర వచ్చినప్పుడు అమ్ముకునే వసతి కల్పించారు. పంట గిట్టుబాటు ధరలు పెంచాలని నిత్యం కేంద్రంతో మాట్లాడుతున్నారు. వర్షం వస్తే రైతు అప్పు కోసం అక్కడా, ఇక్కడా తిరగాల్సిన పరిస్థితి ఉండొద్దని రైతుకు ఎకరానికి 4000 రూపాయల పంట పెట్టుబడిని ఏడాదిలో రెండుసార్లు ఇస్తూ ఎకరానికి 8000 రూపాయలను ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి దేశంలో సిఎం కేసిఆర్‌ ఒక్కరే అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. రైతు సంక్షేమం కోసం దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని పథకాలు అమలు చేస్తున్న సిఎం కేసిఆర్‌ ను రైతులు నిండు మనసుతో ఆశీర్వదించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు.
రైతుతో పాటు పేదింట్లో ఆడపిల్ల పెళ్లి కోసం నేడు 1,00,116 రూపాయలను కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ కింద అందిస్తున్నారు. పేదింటి మహిళ గర్భం దాల్చిన తర్వాత కూడా కూలీ పనలకు వెళ్లాల్సి వస్తుందని గుర్తించిన సిఎం కేసిఆర్‌ ప్రసవానికి 3 నెలల ముందు, ప్రసవం అనంతరం 3 నెలలు, నెలకు రెండు వేల చొప్పున ఆరు నెలల పాటు 12వేల రూపాయలను, ఆడపిల్ల పుడితే అదనంగా 1000 కలిపి మొత్తం 13000 రూపాయలు ఇస్తున్నారు. పుట్టిన బిడ్డకు 16వస్తువులతో కేసిఆర్‌ కిట్‌ ఇస్తున్నారు. తల్లి, బిడ్డను ఏసీ వాహనంలో ఇంటి వద్ద దించుతున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నాణ్యమైన విద్య, పోషకాహారం అందించే గురుకులాలను అత్యధిక సంఖ్యలో ఏర్పాటు చేశారు.’ అని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ఇంట్లో ఆడపిల్లకు పెళ్లి చేసి కళ్యాణ లక్ష్మీ ద్వారా లబ్ది పొందిన మహిళలను, సర్కారు దవాఖానాల్లో ప్రసవించిన మహిళల బంధువులను వేదిక విూదకు పిలిచి ఆ పథకాలు అమలు జరుగుతున్న తీరును, వాటిలో పొందుతున్న లబ్దిని వారి ద్వారా చెప్పించడంతో సమావేశంలో ఉన్న వారంతా చప్పట్లతో అభినందించారు.

Other News

Comments are closed.