హైదరాబాద్ కు  మెట్రో  రైలునవంబర్ లో ప్రారంభం

share on facebook

హైదరాబాద్  ప్రజల కలల  ప్రాజెక్టు మెట్రో రైలు  ప్రారంభానికి  సిద్ధమవుతోంది.  దాదాపు  ఐదేళ్ల పాటు  కొనసాగిన  పనులు దశకు  చేరుకుంటున్నాయి.  72 కిలోమీటర్ల  ప్రాజెక్టులో.. మొదటి దశ  ప్రారంభానికి  ముస్తాబు అవుతోంది. నవంబర్ లో మెట్రో కూత  హైదరాబాద్ ను  పలకరించనుంది. 2012లో  మొదలైన  హైదరాబాద్ మెట్రో పనులు. . ఇక్కడి వరకూ  రావడం వెనక  జరిగిన కృషి  ఏంటి?  ఎలాంటి అడ్డంకులు  అధిగమించి.. మెట్రో   ఈ దశకు  చేరుకుంది? హైదరాబాద్ కు  మరో మణిహారంలా  మెట్రో  ఎలా  మారబోతోంది?

శరవేగంతో మెట్రో పనులు

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టే దిశగా…మెట్రో  రైలు ప్రాజెక్టు పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి. 15 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో పనులు జరుగుతున్న మెట్రో ప్రాజెక్టును ప్రారంభించేందుకు ముహూర్తం కూడా ఖరారైంది. నగర ప్రజా రవాణా వ్యవస్థలో…మెట్రో రైలు అత్యంత కీలకం కాబోతోంది. ఐటీ, ఫార్మాతో పాటు.. మరిన్ని రంగాలకు వేదికగా మారుతున్న హైదరాబాద్ లో మెట్రో  రైలు ప్రాజెక్టు.. మరో ఆకర్షణగా మారబోతోంది. 2012 ఏప్రిల్ 26న..మెట్రో  మొదటి పిల్లర్ కు.. ఉప్పల్ లోని సర్వే ఆఫ్ ఇండియా దగ్గర శంకుస్థాపన జరిగింది. ఫేజ్ వన్ కింద 14 వేల 132 కోట్ల రూపాయల ఖర్చుతో పనులు మొదలయ్యాయి. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు 29 కిలోమీటర్లు.. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్ నుమా వరకు 15 కిలోమీటర్లు.. నాగోల్ నుంచి శిల్పా రామం వరకు 28 కిలోమీటర్లుగా…మొత్తం మూడు కారిడార్లలో పనులు మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ…30 కిలోమీటర్ల నిర్మాణం, టెస్ట్ రన్ పూర్తి చేసుకున్న మెట్రో ప్రాజెక్టుకు.. మొదటి ఫేజ్ ను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అత్యుత్తమమైన సాంకేతిక పరిజ్ఞానంతో…

ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాలు ఫాలో అవుతున్న విధానాల్లో.. మెట్రో రైల్ విధానం కూడా ఒకటి. మన దేశంలో కూడా చాలా నగరాల్లో మెట్రో ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వాటన్నికంటే అత్యుత్తమమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న మన హైదరాబాద్ మెట్రో….దేశం దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే.. ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రయివేట్ పార్ట్ నర్ షిప్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన హైదరాబాద్ మెట్రో.. పెరుగుగున్న జనాభా అవసరాలకు తగినట్టుగా రూపొందుతోంది. కోటికి చేరుతున్న హైదరాబాద్ పబ్లిక్ కు…ఆర్టీసీ, ఎంఎంటీఎస్ తో పాటు.. మెట్రో కూడా కీలక అవసరం కాబోతోంది. ఆ దిశగానే.. హైదరాబాద్ మెట్రో నిర్మాణం జరిగింది.

వివాదాలను అధిగమిస్తూ…

ప్రతిపాదనల దగ్గర్నుంచి మొదలైన వివాదాలను అధిగమిస్తూ.. ఒక్కో అడుగూ దాటుకుంటూ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు.. ఇప్పటివరకూ చేరుకుంది. దోచుకోడానికే మెట్రోను తెరపైకి తెచ్చారంటూ పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు. మెట్రో పనులతో…హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలు మాయమవుతున్నాయని ఆందోళన చేశారు. ప్రయివేట్ భాగస్వామ్యంతో పనులు పూర్తయ్యే అవకాశం లేదని కూడా కొందరు వాదించారు. చివరికి అందరి సందేహాలను తీరుస్తూ.. శరవేగంగా పనులు పూర్తి చేసుకున్న హైదరాబాద్ మెట్రో.. గమ్యం వైపు అడుగులేసింది.

వైఎస్ హయాంలో అడుగు పడింది

హైదరాబాద్ మెట్రో  రైలుకు…ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అడుగు పడింది. మేటాస్ నవభారత్ కన్సార్షియంకు కాంట్రాక్టు దక్కింది. ప్రాజెక్టుకు సర్కారు నుంచి పైసా తీసుకోబోమన్న సంస్థ.. ఎదురుగా 30 ఏళ్లలో.. 30 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వానికే ఇస్తామని చెప్పడంతో.. తెరవెనక దందాలు ఉన్నాయంటూ సామాజిక కార్యకర్తలు ఆరోపించారు. అదే సమయంలో సత్యం కంప్యూటర్స్ సంస్థ దెబ్బతినడంతో…ఈ వ్యవహారం మూలన పడింది. తర్వాత.. 2008లో ట్రామ్ వేస్ యాక్ట్.. అసెంబ్లీలో పాస్ అయ్యింది. మెట్రో రైల్ ను ప్రయాణ సౌకర్యాలతో పాటు.. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి వాడొచ్చని ఈ చట్టం చెప్పింది. రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా.. 2010లో ఎల్ అండ్ టీ సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది.

2012 ఏప్రిల్ 26న మొదటి పిల్లర్ కు శంకుస్థాపన తర్వాత.. నాగోల్ నుంచి మెట్టుగూడ వరకు 8 కిలోమీటర్ల దూరం పనులు శరవేగంగా పూర్తయ్యాయి. 2013లో క్షేత్ర స్థాయి పనులు మొదలయ్యాయి. 2015కు మొదటి ఫేజ్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 కారిడార్లను.. 6 ఫేజ్ లుగా విభజించి పనులు మొదలు పెట్టారు. మరోవైపు.. మెట్రో కోచ్ ల నిర్మాణంపైనా దృష్టి పెట్టారు. దక్షిణ కొరియా సంస్థ హుందాయ్ రోటమ్.. కోచ్ ల నిర్మాణం కాంట్రాక్టు దక్కించుకుంది. దాదాపు 10 కోట్ల రూపాయలతో ఒక్కో కోచ్ నిర్మించారు. మహిళల భద్రత, పిల్లలు, పెద్దలు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా…అంతర్జాతీయ స్థాయిలో కోచ్ లను తీర్చిదిద్దారు.

ఆది నుంచి అవస్థలే…

మెట్రో పనులు ఊపందుకున్న సమయం నుంచి అసలు ఇబ్బందులు మొదలయ్యాయి. 2013లో సుల్తాన్ బజార్, గన్ పార్క్ దగ్గర నిర్మాణాలతో పాటు… హెరిటేజ్ కన్ స్ట్రక్షన్స్ విషయంలో వివాదాలు తలెత్తాయి. కాంగ్రెస్ హయాంలో నాటి టీఆర్ఎస్ నాయకులు.. మెట్రో రూటు మార్చాలని పోరాటాలు కూడా చేశారు. రాష్ట్రం ఏర్పడ్డాక కూడా ఇలాంటి వివాదాల కారణంగా.. ఏడాది పాటు కోఠి, సుల్తాన్ బజార్, అసెంబ్లీ ఏరియాల్లో పనులు జరగనేలేదు. రూట్ మార్పుతో.. కలిగే సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన ఎల్ అంటీ సంస్థ.. అండర్ గ్రౌండ్ నిర్మాణం సాధ్యం కాదని, భద్రత పరంగా కష్టమని తేల్చడంతో.. మళ్లీ పాత రూటే ఓకే అయ్యింది. ఆ తర్వాత.. సుల్తాన్ బజార్ లోని వ్యాపారస్తులకు మంచి పరిహారంతో పాటు.. మరోచోట షాపింగ్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి.. 2015లో మళ్లీ పనుల జోరును పెంచారు.. హైదరాబాద్ మెట్రో అధికారులు.

 పాత రూట్ లోనే నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

పాత రూట్ లోనే నిర్మాణానికి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. 3 కారిడార్లలో పనులు జోరందుకున్నాయి. 2014 నవంబర్ నాటికి.. నాగోలు నుంచి మెట్టుగూడ వరకు 8 కిలోమీటర్ల దూరం.. మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ వరకు 12 కిలోమీటర్ల దూరంలో మెట్రో నడపాలని నిర్ణయించారు. కానీ.. ఇది ఎక్కువ మందికి ఉపయోగపడదని.. మెట్టుగూడ నుంచి బేగంపేట వరకూ రూట్ పూర్తి చేయాలని.. ఎల్ అండ్ టీ సంస్థకు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అధికారులకూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆ వెంటనే.. సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ దగ్గర.. రైల్వే ట్రాక్ లను దాటుకుంటూ ఆర్వోబీల నిర్మాణంపై ఎల్ అండ్ టీ దృష్టి పెట్టింది. దీంతో.. రెండేళ్ల పాటు.. మెట్టుగూడ బేగంపేట పనులు లేటయ్యాయి.

మెట్రో పనుల్లో ఆలస్యానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ లు కారణమయ్యాయి. 72 కిలోమీటర్ల ప్రాజెక్టులో మొత్తం 8 ఆర్వోబీలు ఉన్నాయి. వాటిలో 6 కాంక్రీట్.. 2 స్టీల్ బ్రిడ్జ్ లు ఉన్నాయి. వీటికి సంబంధించి.. ట్రాఫిక్ బ్లాక్ చార్జీల కింద.. 80 కోట్ల రూపాయలను దక్షిణ మధ్య రైల్వే వసూలు చేసింది. ఈ ప్రభావం.. పనులపై కూడా పడింది. చివరికి కేంద్రంతో సీఎం కేసీఆర్ చర్చలు చేయడంతో…ఆర్వోబీల నిర్మాణాలు ముందుకు కదిలాయి. చివరికి రైల్వే అనుమతి తర్వాత…భూ సేకరణ, కోర్టు కేసుల అడ్డంకులు దాటుకుంటూ.. పనుల్లో వేగం పెరిగింది.

భూసేకరణే పూర్తికాలేదు…

ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతుండడంతో.. మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందించాలని ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. కానీ.. జూబ్లీ బస్ స్టాండ్ నుంచి ఫలక్ నుమా వరకు.. 15 కిలోమీటర్ల కారిడార్ లో.. ఇంకా భూసేకరణే పూర్తి కాలేదు. మరోవైపు.. ఈ రూట్ ను ఎంఐఎం కూడా వ్యతిరేకిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. మొదటి ఫేజ్ పనులను దారికి తెచ్చిన అధికారులు.. త్వరలోనే ప్రారంభానికి సిద్ధమువుతన్నారు. రెండో ఫేజ్ తో లక్ష్యం పూర్తి చేసుకోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. 2018 నవంబర్ నాటికి.. అన్ని రూట్లలో మెట్రో పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అనుకున్న ప్రాజెక్టు.. అనుకున్నట్టుగా పూర్తయితే హైదరాబాద్ జనానికి ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని అధికారులు ఆశాభావంతో ఉన్నారు.

Other News

Comments are closed.