14న టిఆర్‌ఎస్‌ సన్నాహక సభ

share on facebook

భారీగా ఏర్పాట్లు చేస్తున్న శ్రేణులు
16సీట్ల లక్ష్యంతో ముందుకు సాగుతామన్న ఇంద్రకరణ్‌ రెడ్డి
ఆదిలాబాద్‌,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఈనెల 14న టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభకు రానున్నారని.. పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేసి సభను విజయవంతం చేయాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్‌ మైదానంలో ఈనెల 14న నిర్వహించే సన్నాహక సభకు రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాజరవుతున్నారని  అన్నారు. ఆదిలాబాద్‌ పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో సన్నాహక సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారన్నారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పని చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన తర్వాత కేటీఆర్‌ తొలిసారిగా జిల్లా రానున్నారన్నారు.  పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా జనసవిూకరణ బాధ్యతలను పార్టీ నాయకులు తీసుకోవాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో ఏ పా ర్టీకి స్పష్టమైన మెజార్టీ రాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు అధికారాన్ని స్థాపించ లేవన్నారు. రాష్ట్రంలో 16 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంటే కేంద్రాన్ని శాసించి రాష్ట్ర అభివృద్ధికి అధిక నిధులు పొందవచ్చన్నారు. జిల్లాలోని పార్టీ నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ బహిరంగ సభ నిర్వహణలో భాగస్వాములు కావాలన్నారు. జైనథ్‌ మండలం నుంచి నాలుగు వేల మందితో రెండు వేల మోటార్‌ బైక్‌ ర్యాలీతో తరలిరావాలని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. డ్వాక్ర మహిళలు, దళితబస్తీ లబ్ధిదారులు, రైతు సమన్వయ సమితి గ్రామ, మండల సభ్యులను తరలించాలన్నారు. 16 ఎంపీ స్థానాలతో పాటు ఒక ఎంఐఎం ఎంపీ స్థానాన్ని గెలిపించుకొని ఇతర రాష్ట్రాల 50 మంది ఎంపీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి కేంద్రం నుంచి నిధులు మంజూరు అయ్యేందుకు ఒత్తిడి తేవచ్చన్నారు. దీంతో పాటు కేంద్రాన్ని శాసించే స్థాయి వస్తుందన్నారు.  పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.

Other News

Comments are closed.