19తరువాత తెలంగాణలో..  సోనియా పర్యటన


– పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్న సోనియా
– సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు
హైదరాబాద్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : ఈనెల 19తర్వాత సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు సోనియా గాంధీ రాష్ట్రంలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలను కాంగ్రెస్‌ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈసారి ప్రజాకూటమి పేరుతో నాలుగు పార్టీలు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోనున్నాయి. ఈ క్రమంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీతో రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సభలు నిర్వహించేలా ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. ఈనెల 19నాటికి అభ్యర్థుల వివరాలు వెల్లడికానున్న నేపథ్యంలో జాతీయ నాయకులతో
పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్‌ అధినాయకత్వం షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సోనియా గాంధీతో రెండు దఫాలుగా తెలంగాణలో ప్రచారం నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. 19వ తేదీ అనంతరం ఉత్తర తెలంగాణలో రెండు రోజులు, దక్షిణ తెలంగాణలో రెండు రోజుల పాటు సోనియా గాంధీతో ఏడెనిమిది నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహించాలని పార్టీ భావిస్తోంది. ఇప్పటికే సోనియా గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ పూర్తి అయినట్లు తెలుస్తోంది. సోనియా తర్వాత పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ కూడా తెలంగాణలో పర్యటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జాతీయ స్థాయి నాయకులతో కూడా సభలు, సమావేశాలు నిర్వహించాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గంలో వంటేరు ప్రతాప్‌రెడ్డి మహాకూటమి అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. దీంతో గట్టి పోటీ నెలకొంటుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీతో అక్కడ సభకు ఏర్పాట్లు చేస్తే దాని ప్రభావం ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లాపై ఉంటుందని రాహుల్‌తో ఆ పార్టీ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. సోనియా గాంధీ సభ గజ్వేల్‌ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈనెల 19 తరువాత తెలంగాణలో సోనియా, రాహుల్‌ గాంధీలు పర్యటించి బహిరంగ సభల్లో పాల్గోనున్నారు. ఇదిలా ఉంటే ఏఏ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేయాలనే దానిపై రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.