అడవుల్లో జంతువుల వేటపై కఠిన ఆంక్షలు

జంతువులపై వేటగాళ్ల ఉచ్చు పడకుండా డేగకన్ను
సత్ఫలితాలు ఇస్తున్న పులుల రక్షణ చర్యలు
ఆదిలాబాద్‌,అక్టోబర్‌21 ( జనం సాక్షి): ఆదిలాబాద్‌ అడవుల్లో వేటగాళ్ల వల్ల పులుల సంగతేమో గాని ఇతర జంతువులు అంతరిస్తున్నాయన్న ఆందోళన ఉంది. ఇక్కడ  కలపను విచ్చలవిడిగా ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లావాసులకు పలుచోట్ల పులులు కనిపించాయని చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో పులుల సంరక్షిత ప్రాంతం మరింతగా అభివృద్ధి చేసేందుకు అటవీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల మావోల అలజడితో ఉమ్మడి జిల్లాలో అడవులను జల్లెడ పడుతున్నారు. జిల్లా బృందం అక్కడి సాయుధ అటవీ సిబ్బంది సాయంతో ఆ ప్రాంతంలో పర్యటించారు. మరోవైపు కలప అక్రమరవాణాను అడ్డుకోవడంతో పాటు వేటగాళ్లపై నిఘా పెట్టారు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు సవిూప గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. అడవులతో పాటు జంతుజాలం సంరక్షణకు  చేపట్టాల్సిన అంశాలు, నిర్వాసితుల పునారావాసం, పర్యటక ప్రాంత అభివృద్ధి తదితర అంశాలపై లోతుగా ఆలోచిస్తున్నారు. కవ్వాల్‌ పులుల సంరక్షణ కేంద్రంలో గత వేసవిలో నీటి కొరత రాకుండా చర్యలు తీసుకున్నారు. అక్కడక్కడా నీటి తొట్టెలను ఏర్పాటుచేసి వేసవి దాహం తీర్చేలా అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. వన్యప్రాణులకు వేసవి నీటి కొరత రాకుండా చూడాలని అటవీ అధికారులకు ఉన్నతాధికారుల సూచించారు. అలాగే అడవుల్లో వేటగాళ్ల బెడద ఎక్కువగా ఉంది. కుందేళ్లు, అడవికోళ్లు,జింకలను వేటాడి చంపుకు తింటున్నారు. ఈ జీవుల సంఖ్య ఉంటేనే పులుల సంఖ్య కూడా వృద్ది చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. చిన్న జంతువులు ఉంటేనే పులుల వేటకు అనుకూలంగా ఉంటుంది. ఇలాంటి చిన్న జంతువుల మనుగడకు  అనువైన వాతావరణం కల్పించేందుకు  తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. అడవిలో కుందేళ్లు, జింకలు, మెకాలు, దున్నలు, మనుబోతులు తదితర శాఖాహార జీవుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడానికి వేటగాళ్లే కారణమని తెలుస్తోంది. ఇక్కడి వేటగాళ్లకు తోడు  కొందరు జిల్లాలోని అడవుల్లో సంచరిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి బయలుదేరేవారు సరిగ్గా రాత్రి సమయంలోనే అడవిని చేరుకుంటారు. అత్యాధునిక ఆయుధాలతో మనుబోతులు, దుప్పులు, కుందేళ్లను వేటాడి మాంసాన్ని తీసుకెళ్తుంటారు. ప్రతి సంవత్సరం గణనీయంగా అడవిజంతువుల  సంఖ్యకూడా తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవల సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో అటవీ అధికారులు కఠినంగానే వ్యవహరిస్తున్నారు.
అడవులు అంతరించి పోతున్న క్రమంలో వాటి రక్షణకు గతంలో తీసుకున్న చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వలేదు. పెరియార్‌ తరహా అడవుల రక్షణకు పరిశీలనజరిగినా ఆచరణలోమాత్రం ఇంకా ముందుకు సాగడం లేదు. గతంలో ఓ అధికార బృందం అక్కడికి వెళ్లి పరిశీలన చేసింది.  కేరళలోని పెరియార్‌ పులుల సంరక్షణ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి తీరుతెన్నులు అధ్యయనం చేశారు. ఇక బఫర్‌ ప్రాంతంలో సవిూప
ప్రజలకు ఉపాధికి మంచి అవకాశాలు కల్పించారు. మరోవైపు పెరియార్‌ పర్యాటకంగా కూడా బాగా ప్రాచుర్యం పొందింది. దీనికి తోడు అక్కడ వర్షపాతం ఎక్కువగా ఉండటం సతత హరిత అరణ్యాలు కావడంతో పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అందుకే దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యటకులు పెరియార్‌ పర్యటక ప్రాంతానికి వస్తుంటారు. అటవీ ప్రాంతంలో లభించే తేనే, మిరియాలు, ఇతర సుగంధ ద్రవ్యాలు అక్కడ విరివిగా ఉండటంతో ఉపాధికి మంచి అవకాశాలున్నాయి. కేరళలోని పెరియార్‌ తరహాలో రక్షణ చర్యలకు సిద్దం అవుతున్నారు. ఇటీవల గ్రామాల్లో పులుల సంచారం కనిపించింది. పశువులపై దాడులు చేస్తున్నాయి. పులులకు క్రమంతప్పకుండా ఆహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తే  వాటి సంఖ్య పెరుగుతందని భావిస్తున్నారు.  ఇలా జిల్లా అడవుల్లో శాఖాహార జీవులతోపాటు, మాంసాహార జీవుల సంఖ్యకూడా రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. దీంతో  గ్రామ సవిూపంలో మేతకువెళ్లే ఆవులు, గొర్రెలు, మేకలను చంపి తింటున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని పెంచుకునే గ్రావిూణ రైతులు నష్టపోతున్నారు.