అభివృద్ది సంక్షేమానికి పెద్దపీట

వ్యవసాయానికి దక్కిన ఊరట
నిజామాబాద్‌,మార్చి8(జనం సాక్షి): గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భారీగా బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన ప్రభుత్వం…అభివృద్ధి, సంక్షేమం వైపు వడివడిగా అడుగులు వేయడానికి నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం 2021`22 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయగా, ఇందులో సాగునీటి ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచారు. ప్రత్యేకంగా దళితబంధు పథకం, బీసీ, మైనార్టీ, బ్రాహ్మణ, గౌడ, మహిళలకు సంక్షేమ పథకాల కొనసాగింపు వంటివి ప్రజలకు మేలు చేకూర్చనున్నాయి. గతంతో పోలిస్తే సాగు, సంక్షేమంలో స్వల్పంగా పెరుగుదల కనిపిస్తోంది. పలురంగాల ప్రజలను ఆకర్శించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు పెంచిందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఆసరా పెన్షన్‌ వయస్సును 65 సంవత్స రాల నుంచి 57కు తగ్గిస్తూ అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయిం చింది. ఆసరాకు రూ. 11,728 కోట్లు కేటాయించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు 2,750 కోట్లు కేటాయించగా జిల్లాకు సైతం వాటా అందనుంది. రోజురోజుకు పెరిగి పోతున్న సాగు ఖర్చుల నుంచి రైతులకు ఊరట కలిగించేందుకు ప్రభుత్వం రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకం కింద సర్కారు ఒక్కో ఎకరానికి రూ. 5వేలు ఆర్థిక సహాయం అందిస్తోంది. బడ్జెట్లో 24,250 కోట్లు ప్రభుత్వం కే టాయించింది. రైతు బీమాకు రూ. 2 వేల కోట్లు కేటాయించారు. జిల్లాలో సంక్షేమం సైతం పరుగులు పెట్టనుంది. సంక్షేమ శాఖలోని పలు పథకాలకు ప్రభుత్వం రూ. వేల కోట్ల నిధులను కేటాయించింది. గిరిజన సంక్షేమానికి రూ.12,565కోట్లు, బీసీ సంక్షేమానికి రూ. 5,698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమానికి రూ. 117 కోట్లు కేటాయించింది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సైతం సంక్షేమ ఫలాలు అందనున్నాయి. గొర్రెల పంపిణీకి రూ. 11వేల కోట్లు కేటాయించారు. గొల్ల, కురుమలను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2017 లో సబ్సీడీ గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టింది. అదేవిదంగా పశుసం వర్థఖ శాఖలోని పలు పథకాలు, మత్స్యశాఖకు చెందిన పథకాలకు సైతం నిధుల కేటాయింపు జరిపారు. జిల్లాలో ఏకైక వ్యవసాయ కర్మాగారంగా గుర్తింపు పొందిన నిజాం దక్కన్‌ షుగర్స్‌ లిమిటెడ్‌ కర్మాగారం పునరుద్ధరణకు బడ్జెట్లో ఎత్తలేదు. సొంత స్థలాలు ఉన్న వ్యక్తులు ఇళ్ల నిర్మాణాలకు రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం నిర్ణయించి నిధులు కేటాయించింది. ప్రతీ నియోజకవర్గానికి 3వేల ఇళ్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ విూడియం బోధన, మహిళా, అటవీ విశ్వవిద్యాల యాలతో జిల్లాకు సైతం ప్రయోజనం చేకూరనుంది. రక్తహీనత గల వనితలు, పాఠశాల బాలికలకు కొత్తగా ఉచిత కేసీఆర్‌ న్యూట్రిషియన్‌ కిట్స్‌, హెల్ల్‌ అండ్‌ హైజనిక్‌ కిట్స్‌ అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యతనిచ్చారు. సాగు, తాగునీటి రంగాలకు నిధుల కేటాయింపు జరిగింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు జరిపారు. పల్లెలు, పట్టణాలు తేడా లేకుండా బడ్జెట్‌ కేటాయింపులు సమానంగా జరిపారు.