అయితే అయ్యర్‌పై వేటు తప్పదా!

వెస్టిండీస్‌తో టీమిండియా రెండో టీ20 నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యానికి చిక్కులు తప్పవని అభిప్రాయపడ్డాడు. ఎవరికి తుది జట్టులో చోటు ఇవ్వాలి.. ఎవరిని తప్పించాలనేది టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిందని పేర్కొన్నాడు.

కాగా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో ఆఖరి రెండు మ్యాచ్‌లలో రిషభ్‌ పంత్‌ ఓపెనర్‌గా రాగా.. విండీస్‌తో మొదటి మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ రోహిత్‌కు జోడీగా బరిలోకి దిగాడు. ఇక ఐర్లాండ్‌తో సిరీస్‌లో ఆకట్టుకున్న దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌లకు వెస్టిండీస్‌తో తుది జట్టులో స్థానం దక్కలేదు.

అదే సమయంలో.. విండీస్‌తో వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్న శ్రేయస్‌ అయ్యర్‌కు మాత్రం చోటు లభించింది. అయితే, వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. కాగా ఐపీఎల్‌-2022 తర్వాత టీమిండియా తరఫున టీ20 ఫార్మాట్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పటి వరకు చేసిన పరుగులు వరుసగా.. 36, 40, 14, 4, 0 నాటౌట్‌(దక్షిణాఫ్రికాపై).. ఇంగ్లండ్‌పై 28, విండీస్‌పై 0.

ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘‘భారత తుది జట్టు ఎంపిక విషయంలో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత మ్యాచ్‌లో పిచ్‌ పరిస్థితిని చక్కగా అంచనా వేసి ముగ్గురు స్పిన్నర్ల(రవిచంద్రన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయి, రవీంద్ర జడేజా)తో బరిలోకి దిగింది. అందరూ బాగా ఆడారు.

ఈ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులను పరిశీలిద్దాం. గత సిరీస్‌లో రిషభ్‌ పంత్‌ ఓపెనర్‌గా వచ్చాడు. ఇక గత మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఓపెనర్‌. నిజానికి సంజూ శాంసన్‌ జట్టుతోనే ఉన్నాడు. ఒకవేళ అతడిని ఆడిస్తే సూర్యను తప్పించాలి. అప్పుడు రిషభ్‌ మిడిలార్డర్‌లో ఆడాలి. అలా అయితే.. శ్రేయస్‌ అయ్యర్‌ స్థానం ప్రశ్నార్థకమవుతుంది.

నిజానికి సూర్య రెగ్యులర్‌ ఓపెనర్‌ కాదు. కానీ ఒకవేళ రెండో టీ20లో ప్రయోగం చేయాలనుకుంటే సంజూ శాంసన్‌ రోహిత్‌కు జోడీగా పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా కాకుండా సూర్యతోనే ఓపెనింగ్‌ చేయించినా.. సంజూ తుదిజట్టులోకి వచ్చినా శ్రేయస్‌ను తప్పించకతప్పదు’’ అని తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

ఈ మేరకు విండీస్‌తో సెయింట్స్‌ కిట్స్‌ వేదికగా సోమవారం(ఆగష్టు 1) రెండో టీ20లో తలపడబోయే భారత తుదిజట్టును అంచనా వేశాడు. బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ జడేజాకు జట్టులో చోటు ఖాయమని.. అశ్విన్‌, బిష్ణోయిలలో ఎవరో ఒకరే ఆడతారని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. మొదటి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన రోహిత్‌ సేన.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఇప్పటికే ఆధిక్యంలో ఉంది.రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌/సంజూ శాంసన్‌, రిషభ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, దినేశ్‌ కార్తిక్‌, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌/రవి బిష్ణోయి, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, హర్షల్‌ పటేల్‌.