అల్లంతదూరంలో అరుణగ్రహం

– నెల రోజుల ప్రయాణం

బీజింగ్‌,జనవరి 3(జనంసాక్షి):అరుణ గ్రహంపైకి చైనా ప్రయోగించిన టియాన్‌వెన్‌-1 పరిశోధక నౌక ప్రయాణం కొనసాగుతోంది. జులై 23న వెన్‌ఛాంగ్‌ అంతరిక్ష ప్రయోగశాల నుంచి లాంగ్‌మార్చ్‌-5 రాకెట్‌ ద్వారా దీన్ని ప్రయోగించారు. టియాన్‌వెన్‌ ఇప్పటి వరకు 400 మిలియన్‌ కిలోవిూటర్లకు పైగా ప్రయాణించినట్లు చైనా జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (సీఎన్‌ఎస్‌ఏ) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. మరో నెల రోజుల్లో అరుణ గ్రహం కక్ష్యలోకి ప్రవేశించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాహకనౌక గమన మార్గమంతా సాధారణంగానే ఉందని, అంగారకుడి కక్ష్యలోకి వెళ్లిన తర్వాత నౌక వేగం క్రమంగా తగ్గుతూ వస్తుందని చెప్పింది. సేఫ్‌ ల్యాండింగ్‌ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపింది.టియాన్‌వెన్‌-1 వాహకనౌక దాదాపు 5 టన్నుల బరువుంటుంది. దీనిలో ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌ ఉంటాయి. టియాన్‌వెన్‌-1 అరుణగ్రహంపై దిగిన తర్వాత అక్కడి మట్టిని, గ్రహ అంతర్భాగాలు, వాతావరణం, నీరు తదితర అంశాలపై ప్రయోగాలు జరపనుంది. అంగారక గ్రహ కక్ష్యలోకి చేరిన తర్వాత శోధక నౌకలోని ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లు విడిపోతాయి. ఆర్బిటర్‌ కక్ష్యలోనే ఉంటూ ప్రయోగాలు చేయగా… ల్యాండర్‌, రోవర్‌ అంగారక గ్రహంపై దిగి ప్రయోగాలు చేపడతాయి. ఆరు చక్రాలున్న రోవర్‌ సుమారు 200 కిలోల బరువు ఉంటుంది. మూడు నెలలపాటు అక్కడే తిరుగుతూ ప్రయోగాలు చేయనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, భారత్‌, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు అంగారకుడిపై ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించాయి. అంగారకుడిపై అడుగుపెట్టిన తొలి ఆసియా దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2014లో మంగళ్‌యాన్‌ ప్రయోగం ద్వారా భారత్‌ ఈ ఘనత సాధించింది.