అల్‌ఖైదా అగ్రనేత అల్‌ జవహరి హతం

కాబూల్‌ డ్రోన్‌ దాడుల్లో మట్టుపెట్టిన అమెరికా దళాలు
ధృవీకరించిన తాలిబన్‌ ప్రభుత్వం
ఇక పీడ విరగడ అయ్యిందన్న జో బైడెన్‌
వాషింగ్టన్‌,అగస్టు2(జ‌నంసాక్షి):అల్‌ ఖైదా ముఖ్యనాయకుడు అల్‌` జవహరీ హతమయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో తామే అల్‌` జవహరీని మట్టుబెట్టినట్టు స్వయానా అమెరికా ప్రకటించింది. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌ లో చేపట్టిన ఓ విజయవంతమైన ఉగ్రవాద నిరోధన ఆపరేషన్‌ కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటన చేశారు. అల్‌ ఖైదా చీఫ్‌ అల్‌ జవహరీ మరణించినట్టు వెల్లడిరచిన బైడెన్‌… అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్నా పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఎంత కాలమైనా.. ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతామని తేల్చి చెప్పారు. ఇదిలా ఉండగా ఆఫ్ఘనిస్థాన్‌ రాజధాని కాబుల్‌ లోని షేర్పూర్‌ ప్రాంతంలో ఓ నివాసంపై వైమానిక దాడి జరిపినట్టు తాలిబన్‌ లీడర్లలో ఒకరు తెలిపారు. ఈ దాడిని అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘనగా అభివర్ణిస్తూ ఖండిరచారు. ఈజిప్ట్‌ సర్జన్‌ గా ఉన్న అల్‌`జవహరీ .. నేడు ప్రపంచంలోనే మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల్లో ఒకరిగా మారాడు. 2001 సెప్టెంబర్‌ 11న అమెరికాపై జరిపిన ఉగ్రదాడుల్లో దాదాపు 3 వేల మంది చనిపోగా.. ఈ దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా జవహరీని అమెరికా గుర్తించింది. ఇక అప్పట్నుంచి వరల్డ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టుల్లో జవహరీ పరారీలోనే ఉన్నాడు. ఒసామా బిన్‌ లాడెన్‌ ను అమెరికా దళాలు 2011లో హతమార్చిన తర్వాత జవహరీ అల్‌`ఖైదా పగ్గాలు చేపట్టాడు. అంతేకాదు జవహరీపై 25 మిలియన్‌ డాలర్ల రివార్డును కూడా అమెరికా ఇంతకుముందే ప్రకటించింది. అల్‌` జవహరీ ని మట్టుబెట్టడంపై తాలిబన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని ఖండిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన జరగడం చాలా బాధాకరమని, ఇది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినట్టేనని ఆరోపించారు. తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా అమెరికా ఈ దాడి చేసిందన్న తాలిబన్లు.. యూఎస్‌ దళాల ఉపసంహరణ పై 2020 ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకోలేదని మండిపడ్డారు. జవహరీ కోసం అగ్రరాజ్యం 21 ఏళ్లుగా ఎందుకు గాలిస్తోంది. అమెరికన్లే లక్ష్యంగా దశాబ్దాలుగా జరుగుతున్న అనేక దాడులకు సూత్రధారి. అతడు ఎప్పటికీ ఈ లోకంలో లేకుండా చేసే లక్షిత దాడికి నేను ఆదేశాలు ఇచ్చా. ఇప్పుడు న్యాయం జరిగింది. ఆ ఉగ్రవాద నాయకుడు ఇక లేడు. ఆ కిరాతక హంతకుడికి ప్రపంచ ప్రజలెవరూ ఇక భయపడాల్సిన పని లేదు. మా ప్రజలకు ముప్పు కలిగించే వారు ఎంతకాలం, ఎక్కడ దాక్కున్నా.. వారి అంతుచూస్తామన్నది సుస్పష్టం అని జో బైడెన్‌ ప్రకటించారు.