అసహజ వాతావరణం సృష్టించడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ దిట్ట

అందుకే అదంటేనే భయమన్న సిద్దరామయ్య

బెంగళూరు,అక్టోబర్‌21 (జనంసాక్షి) : తనకు ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే భయమని కర్ణాటక ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. సమాజంలో అసహజ వాతావరణం సృష్టించి రాజకీయంగా లబ్ది పొందాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకుంటుందని, అవి ప్రజలపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆయన వివరణ ఇచ్చారు. దేశంలో సామాజిక సామరస్యం గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందుతుంటానని అన్న ప్రభుత్వంపై జరిపే పోరాటంలో ప్రజలు కూడా చేతులు కలిపితే ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు. గురువారం తన అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘అధికారం కోసం డబ్బు కోసం కాంగ్రెస్‌ చీటింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ అంటోంది. అధికారం శాశ్వతం కాదని మాకు బాగా తెలుసు. అధికారం కోసం బీజేపీ చేసే తప్పుడు పనులు మాకు అంటగుతున్నారు. 2023లో ఎన్నికలు ఉన్నాయి. చూద్దాం ఎవరు జైలుకు పోతారో?‘ అని ట్వీట్‌ చేశారు. అనంతరం మరో ట్వీట్‌లో ఆయన స్పందిస్తూ ‘ప్రజల నిత్యవసరాల ధరలను బీజేపీ ప్రభుత్వం రోజురోజుకూ పెంచుతోంది. ప్రజల్లో ఈ విషయమై ఆగ్రహం ఉంది. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై మేం పోరాటం చేస్తూనే ఉంటాం. దానికి ప్రజల సహకారం తోడైతే మా పోరాటం బలోపేతం అవుతుంది. ఈ దేశానికి ఆర్‌ఎస్‌ఎస్‌ అత్యంత ప్రమాదకరం. ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే నాకు భయం. ఎందుకంటే సమాజంలో అసహజ వాతావరణం సృష్టించి రాజకీయంగా లబ్ది పొందాలని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుకుంటుంది‘ అని రాసుకొచ్చారు.