ఆంధ్రాలో పంచాయతీ ఎన్నికలు

– రీషెడ్యూల్‌ చేసిన ఎన్నికల కమీషనర్‌

దిల్లీ,జనవరి 25(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని.. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కోసం వాయిదా వేశారని రోహత్గి కోర్టుకు విన్నవించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో.. పోలీసులు వ్యాక్సిన్‌ భద్రతలో ఉన్నారని వివరించారు. రాష్ట్ర హైకోర్టు సింగిల్‌ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారని రోహత్గి తెలిపారు. వ్యాక్సినేషన్‌ కోసం 5 లక్షల మంది సిబ్బంది అవసరమవుతారని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనిపై వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం ఎన్నికలు వాయిదా వేయడం కుదరదని స్పష్టం చేసింది.

ఎన్నికలను రీషెడ్యూల్‌ చేసిన ఎస్‌ఈసీ

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్‌ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంకాని నేపథ్యంలో గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌లో మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రెండో దశను మొదటి దశగా, మూడో దశను రెండో దశగా, నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశగా మార్చింది. గత షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తాజాగా దానిలో మార్పులు చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మొదటి దశకు ఈనెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2, మూడో దశకు 6, నాలుగో దశకు 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సేవలు వాడుకోవాలని జిల్లా కలెక్టర్లను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆదేశించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా నిర్వహించాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ హృషికేశ్‌రాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టి వేస్తూ ఎన్నికల నిర్వహణకు అనుమతించింది.