ఆక్రమణ స్మశాన వాటిక సందర్శనకు జస్టిస్‌ చంద్రకుమార్‌

నంగారభేరి ఎస్‌హెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భద్రు నాయక్‌

ఖమ్మంబ్యూరో,అక్టొబర్‌ 6 (జనంసాక్షి)

ఖమ్మం నగరానికి ఆనుకుని ఉన్న రఘునాథపాలెం గ్రామంలో ఆక్రమణకు గురైన స్మశాన వాటిక సందర్శనకు ఈ నెల 9వ తేదీన జస్టిస్‌ చంద్రకుమార్‌ విచ్చేస్తున్నట్లు నంగారభేరి లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు బాణోతు భద్రు నాయక్‌ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోనిఎల్‌హెచ్‌పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గని ప్రసంగించారు. జిల్లాలోని చాలా గ్రామాల్లో స్మశాన వాటికలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దుస్థితి నెలకొందన్నారు. ఇలాంటి స్థితిలో రఘునాథపాలెం గ్రామంలోరాజకీయ పెద్దలు ఆక్రమించిన స్మశాన వాటిక స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజల సౌకర్యార్దం స్మశానికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు దశలవారీ పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 5.20 ఎకరాల్లో స్మశాన వాటిక ప్రస్తుతం ఒక్క ఎకరానికి కుంచించుకుపోయినపరిస్థితి నెలకొందన్నారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేయగా ఈ నెల 9వ తేదీన సందర్శనకు వస్తున్నట్లు తెలిపారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీనివాస్‌ నాయక్‌, జె.రవి, డి.శ్రీనివాస్‌, వికాస్‌, రవీందర్‌ తదితరులు పాల్గన్నారు.