ఆదిలాబాద్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుతాం


ఆదిలాబాద్‌ జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌

ఆదిలాబాద్‌ ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఆదిలాబాద్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని, పారిశుద్ధ్య చర్యలను మరింత మెరుగుపరుస్తున్నామని జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ పేర్కొన్నారు. మంగళవారం 4వ వార్డు పరిధిలోని బంగారుగూడలో రూ.3.50 కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఆమె ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. చెత్తశుద్ధి కేంద్రాన్ని ఆధునికీకరించామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణ ప్రజల ఆరోగ్యరీత్యా పుర కార్యవర్గం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు గుర్తు చేశారు. గతంలో మానవ విసర్జితాలను ఎక్కడపడితే అక్కడ పడేయడంతో దుర్వాసనతో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందిగా ఉండేదన్నారు. పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనం ద్వారా ఈ సమస్య దూరం కానుందన్నారు. ఈ ప్లాంటు నుంచి తయారు చేసిన సేంద్రియ ఎరువులు రైతులకు ఉపయోగపడున్నట్లు చెప్పారు. అంతకుముందు ప్లాంటు ఆవరణలో మొక్కలు నాటి ఆధునాతన యంత్రాలను పరిశీలించారు. తదనంతరం సెప్టిక్‌ట్యాంక్‌ నిర్వాహకులకు లెసెన్సులను అందజేశారు. జిల్లా అదనపు పాలనాధికారి డేవిడ్‌, పుర అధ్యక్షుడు జోగు ప్రేమేందర్‌, ఉపాధ్యక్షుడు జహీర్‌రంజానీ, పుర కమిషనర్‌ శైలజ, కౌన్సిలర్‌ శ్రీనివాస్‌, ఆస్కో బృంద మేనేజర్‌ రంజీత్‌, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.