ఇమేజ్‌ కోల్పోయిన్‌ ట్రంప్‌

– దాడితో ఛీ కొడుతున్న జనం

వాషింగ్టన్‌,జనవరి 13(జనంసాక్షి):చెరువులో నీరు బాగా ఉన్నప్పుడు అందులో కొట్టుకొచ్చే చీమలను చేపలు తింటాయి.. అదే నీరు ఇంకిపోయాక.. ఆ చేపలను చీమలు తింటాయి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పరిస్థితి అలానే ఉంది. అమెరికాలో క్యాపిటల్‌ భవనంపై దాడి తర్వాత ఆయన ఇమేజ్‌ ఒక్కసారిగా దిగజారిపోయింది. సన్నిహితులు కూడా ఆయనకు దూరం పాటిస్తున్నారు. మరోవైపు ఆయనపై అభిశంసన మొదలైంది. ఈ సమయంలో ట్విటర్‌, ఫేస్‌బుక్‌, గూగుల్‌తో పాటు పలు సామాజిక మాధ్యమాలు ఆయన ఖాతాలను తొలగించడమో.. లేదా తాత్కాలికంగా నిలిపివేయడమో చేస్తున్నాయి. అందరితోపాటు తాను కూడా ఓ చెయ్యేసి.. ట్రంప్‌పై కసి తీర్చుకోవాలని టిక్‌టాక్‌ కూడా నిశ్చయించుకొంది. ట్రంప్‌కేమో టిక్‌టాక్‌లో ఖాతా లేదు. దీంతో ట్రంప్‌ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను తొలగిస్తున్నట్లు టిక్‌టాక్‌ ప్రకటించింది. దీంతోపాటు చబబినీజూబిష్ట్రవబబివజీశ్రీ వంటి హ్యాష్‌ట్యాగ్‌లను తొలగిస్తోంది. ”విద్వేషపూరిత ప్రవర్తన, హింసకు టిక్‌టాక్‌లో స్థానం లేదు. ఏ ఖాతాలైన హింసను గొప్పగా చూపించినా, ప్రచారం చేసినా మా సామాజిక నిబంధనలను ఉల్లంఘించినట్లే. వాటిని తొలగిస్తాం” అని టిక్‌టాక్‌ ప్రకటించింది.ఆగస్టు నుంచి ట్రంప్‌ కార్యనిర్వాహక వర్గం టిక్‌టాక్‌ను నిషేధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ట్రంప్‌ ఒక సారి టిక్‌టాక్‌ను నియంత్రిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ కూడా జారీ చేశారు. అమెరికా జాతీయ భద్రతను కారణంగా చూపించి ఆయన ఈ చర్యలకు ఉపక్రమించారు. దీంతో అక్టోబర్‌, డిసెంబరులలో ట్రంప్‌ ఆదేశాలను న్యాయస్థానంలో టిక్‌టాక్‌, దాని కంటెట్‌ క్రియేటర్లు సవాల్‌ చేశారు. ఈ కేసులు విచారించిన ఫెడరల్‌ జడ్జిలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండు ఆదేశాలను జారీ చేశారు. వీటిపై డిసెంబర్‌ చివర్లో ట్రంప్‌ అప్పీలుకు వెళ్లారు. మరోవైపు టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించేలా దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌పై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కామర్స్‌ ఒత్తిడి తెస్తోంది. దీనికి సంబంధి డిసెంబర్‌ 4 తుది గడువు. ఇది దాటిపోయి చాలాకాలం అయినా.. అమెరికాలో టిక్‌టాక్‌ పనిచేస్తోంది.

ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌పై ఆంక్షలు..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యూట్యూబ్‌ ఛానల్‌ కూడా ఆంక్షల చట్రంలోకి వచ్చింది. ఆయన పోస్టు చేసిన కొన్ని వీడియోలను తొలగించే పనిలో యూట్యూబ్‌ ఉంది. క్యాపిటల్‌ భవనంపై దాడి చేసిన దుండగులను ‘వెరీ స్పెషల్‌’ అంటూ ట్రంప్‌ పొగిడిన వీడియోను ఇప్పటికే యూట్యూబ్‌ తొలగించింది. ఆ తర్వాత వీడియోలు పోస్టు చేయడంపై ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. కానీ నేడు మాత్రం యూట్యూబ్‌ మరో ప్రకటన జారీ చేసింది. ”సవిూక్ష తర్వాత మా పాలసీకి విరుద్ధంగా ఉన్న వీడియోలను ట్రంప్‌ ఛానల్‌ నుంచి తొలగించాము” అని ప్రకటించింది. నేడు అప్‌లోడ్‌ చేసిన కొన్ని వీడియోల తొలగింపునకు కచ్చితమైన కారణం వెల్లడించలేదు. కొన్ని మాత్రం ఛానల్‌లో ఇప్పటికీ ఉన్నాయి. దీంతోపాటు ట్రంప్‌ ఛానల్‌ ఒక స్ట్రైక్‌ను ఎదుర్కోవడంతో మరో వారం పాటు కొత్త వీడియోలు అప్‌లోడ్‌ చేసే అవకాశం లేదు. దీంతోపాటు ఆ ఛానల్‌లో వీడియోలపై కామెంట్లు చేయడానికి కూడా వీల్లేదు.