ఈనెల 21న హరిత హారం విరివిగా మొక్కలు నాటండి వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి

జోగులాంబ గద్వాల బ్యూరో  (జనంసాక్షి) ఆగస్టు 17 : స్వతంత్ర భారత వజ్రొత్సవాల సందర్భంగా ఈ నెల 21న హరితహారం కార్యక్రమం నిర్వహించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ,రాష్ట్ర అటవీ శాఖ మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
బుధవారం మంత్రి అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతకుమారి తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలక్టరేట్  సమావేశం హాలు నుండి  వీడియో కాన్ఫరెన్సు కు  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి,  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీహర్ష  తో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేడుకల్లో భాగంగా ఆగస్టు 21న ప్రత్యేక సమావేశాలకు బదులుగా రాష్ట్ర వ్యాప్తంగా  హరిత హారం కార్యక్రమం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తెలిపారు. 8వ విడత హరితహారం కార్యక్రమం కింద జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్   మాట్లాడుతూ,  జిల్లాలో  8వ విడత హరితహారం కార్యక్రమం కింద   జిల్లా కు  69 ,447  వేల మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉన్నామని  కలెక్టర్ తెలిపారు. 8వ విడత మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని  కలెక్టర్ తెలిపారు.
ఆగస్టు 10న వనమహోత్సవం కార్యక్రమంలో జిల్లాలో మొక్కలు నాటామని, ఆగస్టు 21న జిల్లా వ్యాప్తంగా 255  పంచాయతీలు, 37 మున్సిపల్ వార్డులలో మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని ,ఉదయం 8 గంటలకు ప్రజా ప్రతినిధుల సమక్షంలో కార్యక్రమం ప్రారంభిస్తామని   కలెక్టర్ తెలిపారు. .  ఆగస్టు 21న కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలకు బాధ్యతలు అప్పగించి,  అనువైన స్థలాలను గుర్తించామని, గుంతల తవ్వకం ప్రక్రియ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో సమావేశంలో  జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీహర్ష , డి పి ఓ శ్యాం సుందర్, ఇంచార్జి డి ఆర్ డి ఓ నాగేంద్రం, అటవీ శాఖ  అధికారులు తదితరులు పాల్గొన్నారు.