ఉక్రెయిన్‌ హెల్త్‌కేర్‌ సెంటర్లపై దాడి

రష్యా తీరుపై ప్రపంచారోగగ్య సంస్థ ఆందోళన
జనీవా,మార్చి18  (జనంసాక్షి):  ఉక్రెయిన్‌లో హాస్పిటళ్లు, హెల్త్‌కేర్‌ సెంటర్లు, నర్సింగ్‌ హోమ్‌ వంటి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలపై రష్యా దాడులు చేయడం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు హెల్త్‌కేర్‌ ఫెసిలిటీస్‌పై 43 సార్లు దాడులు
జరిగాయని దీంతో 12 మంది మృతిచెందారని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ చెప్పారు. మరో 35 మంది గాయపడ్డారని వెల్లడిరచారు. హెల్త్‌కేర్‌పై దాడి చేయడమంటే అంతర్జాతీయ మానవతా చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. అవి ప్రజలకు అత్యవసరంగా అవసరమైన సంరక్షణను అందకుండా చేస్తాయని, అప్పటికే దెబ్బతిన్న ఆరోగ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తాయన్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం మనం అదే చూస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌లో 35 వేలకుపైగా కేంద్రాల్లో మానసిక పరమైన రుగ్మతలో బాధపడుతున్న వారు చికిత్స పొందుతున్నారని, రష్యా దాడుల వల్ల అవి మందులు, ఆహారం, దుప్పట్లు వంటి అత్యవసరాల కొరతను ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం ఉక్రెయిన్‌లో కరోనా వ్యాప్తికి కూడా దోహదం చేస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల కరోనా పరీక్షలు పూర్తిగా తగ్గిపోయాయని, దీంతో మహమ్మారి వ్యాప్తి పెరిగే అవకాశం ఉందన్నారు. దేశంలో కేవలం 40 మంది జనాభాకే పూర్తి స్థాయిలో టీకా తీసుకున్నారని వెల్లడిరచారు.