ఊరూరా ..పొలాల్లోనూ వ్యక్తులకు టీకాలు

ట్విట్టర్‌లో కార్యకర్తలను అభినందించిన కెటిఆర్‌
హైదరాబాద్‌,సెప్టెంబర్‌24 (జనంసాక్షి)  : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ జోరుగా సాగుతోంది. క్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి టీకాలు వేస్తున్నారు. అంతే కాదు.. ఆరోగ్య కార్యకర్తలు పొలాల బాట పట్టారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ బిజీగా ఉంటున్న రైతులకు, కూలీలకు పొలాల వద్దే టీకాలు వేసి వంద శాతం వ్యాక్సినేషన్‌కు కృషి చేస్తున్నారు. పొలాల వద్ద టీకాలు వేస్తున్న ఓ రెండు చిత్రాలను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ వారిని అభినందించారు. ఒకటి ఖమ్మం జిల్లా నుంచి మరొకటి రాజన్న సిరిసిల్ల నుంచి అని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్తల చిత్తశుద్ధికి, నిబద్దతకు ఈ ఫోటోలే నిదర్శనమని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయ విప్లవం ప్రారంభమైందని కేటీఆర్‌ పేర్కొన్నారు.