ఐటీని సద్వినియోగం చేసుకోండి

– యువతకు కేటీఆర్‌ పిలుపు

ఖమ్మం,డిసెంబరు 7 (జనంసాక్షి):పెద్ద నగరాలు, పట్టణాలనకు పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లా కేంద్రాలు, గ్రావిూణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐటీ హబ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఖమ్మంలో నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌తో పాటు దాదాపు రూ.150కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. నగరం నడిబొడ్డున చేపట్టిన ఐటీహబ్‌ ఆరు అంతస్తులను పరిశీలించారు. వివిధ ఐటీ సంస్థలకు కేటాయించిన భవనాలను కలియతిరిగారు. ఆయా సంస్థల ప్రతినిధులు, అధికారులతో మాట్లాడి ఐటీహబ్‌ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. గతంలో ఐటీ రంగం హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకే పరిమితమైందన్నారు. జిల్లా కేంద్రాలు, గ్రావిూణ ప్రాంతాల్లో ఇంజినీరింగ్‌ చదివే యువత అక్కడికి వెళ్లాలంటే అనేక వ్యయ ప్రయాసలు ఎదురయ్యేవని చెప్పారు. ఆ పరిస్థితుల నేపథ్యంలోనే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ ఐటీ రంగాన్ని విస్తరించాలని సంకల్పించారని వివరించారు. ఖమ్మంతో పాటు వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, సిద్దిపేట జిల్లాల్లో ఐటీహబ్‌లు అద్భుతంగా నిర్మిస్తున్నామన్నారు. మొత్తం ప్రభుత్వ ఖర్చుతో నిర్మాణం చేపట్టడమేకాకుండా అతి తక్కువ లీజ్‌ పద్ధతిలో ఐటీ కంపెనీలకు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఖమ్మం ఐటీ హబ్‌ను అద్భుతంగా నిర్మించారని కేటీఆర్‌ ప్రశంసించారు.