కంటి సమస్యలుంటే రంది పడొద్దు: మంత్రి హరీష్ రావు భరోసా 

సిద్ధిపేట బ్యూరో,మే24(జనంసాక్షి):
‘కంటి సమస్యలుంటే రంది పడొద్దు.! మీ కోసమే సిద్ధిపేటలో కంటి దవాఖాన తెచ్చిన.! ఇక్కడ ఉన్న సౌలత్ లన్నీ మీ ఊర్లో క్యాంపు నిర్వహణ సమయంలో అందరికీ చెప్పండి.! నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో నిత్యం కంటి పరీక్ష క్యాంపు నిర్వహణ ఉంటుంది.! సిద్ధిపేట ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య సేవలు, సౌలత్ లు సద్వినియోగం చేసుకోవాలి.! ఇక్కడ కంటి సమస్యలకు పరిష్కారం అందుతున్న సేవల గురించి మీ ఊర్లో అందరికీ తెలిసేలా మీరు చెప్పాలి.! మీ ఊర్లో తెలిస్తే అందరికీ కంటి పరీక్షలు ఉచితంగా చేయించాలన్నదే నా తాపత్రయం.! సిద్ధిపేట నియోజకవర్గంలో క్యాట్రాక్ట్ కంటి సమస్య ఉన్న ఒక్క రోగి ఉండొద్దు అనేదే నా తపన.’అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు.జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖానలో సోమవారం కంటి సమస్యలతో బాధపడుతూ.. పరీక్షలు చేయించుకుంటున్న రోగులను ఒక్కొక్కరినీ మీరెక్కడి నుంచి వచ్చారని ఆరా తీస్తూ.. యోగక్షేమాలు అడిగి ఆప్యాయంగా కంటి రోగులను పలకరించారు.
మీ కోసమే ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన తెప్పించిన. ఇక్కడ ఉన్న సౌలత్ లు అన్నీ మీ ఊర్లో అందరికీ చెప్పి..కంటి చూపుతో బాధపడే వారిని ఇక్కడికి తొలుక రావాలని కంటి సమస్యలతో వచ్చిన రోగులను ఆరోగ్య మంత్రి కోరారు.
ఓ రోగి లచ్చవ్వ బీపీ,షుగర్ కారణంగా కంటి ఆపరేషన్ చేయలేదని మంత్రి దృష్టికి తేగా రంది పడొద్దు లచ్చవ్వ అంటూ భుజం తట్టి నీకు కావాల్సిన మందులు ఇప్పించి, నీకు కంటి ఆపరేషన్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. ఆ పక్కనే కంటి ఆపరేషన్ చేయించుకున్న వృద్ధురాలి వద్దకు వెళ్లి భుజం తట్టి ఆప్యాయతతో అవ్వ నేనెవరినీ అని ఆరా తీస్తూ.. యోగక్షేమాలు అడిగి తెలుసుకోగా.. మా తండ్రివయ్యా హరీశ్ రావు నువ్వనీ విఠలాపూర్ గ్రామ అవ్వ బదులిచ్చింది. నీకు మంచిగ చూశారా.. లేదా.. ఇక నుంచి నీకు కండ్లు మంచిగ కనపడతాయని.. మీ ఊరు నుంచే కంటి పరీక్షలు  మొదలు పెట్టామని మంత్రి చెప్పుకొచ్చారు.సిద్ధిపేట నియోజకవర్గంలో కాట్రాక్ట్ కంటి సమస్యలు వంద శాతం పరిష్కారం చేయాలన్నదే లక్ష్యంగా చేసుకుని ఉన్నట్లు కంటి ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఒక్కొక్కరికీ కంటి పరీక్ష, ఆపరేషన్ కై రూ.18 వేల నుంచి రూ.25 వేల ఖర్చు వస్తున్నదని, రూపాయి ఖర్చు లేకుండా గ్రామంలో క్యాంపు నిర్వహించి ఉచితంగా కంటి సమస్యలతో బాధపడే రోగులకు వైద్యం, కావాల్సిన కళ్ల అద్దాలు అందించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా 123 యూనిట్లు పూర్తి చేసే దిశగా, 8 వేల నుంచి 10 వేల వరకూ కంటి సమస్యతో బాధపడే రోగులు ఉన్నట్లు అంచనా ఉన్నదని, రోజూ వారీగా 15 నుంచి 20 మంది వస్తారని, వారందరికీ కంటి పరీక్షలు జరిపి కావాల్సిన ఆపరేషన్ చేయాలని ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. నిత్యం ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ జరపాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్ సూచించారు.ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని చిన్నకోడూర్ మండలంలోని మల్యాల గ్రామంలోని 17 కంటి రోగులకు 9 మందికి క్యాట్రాక్ట్ సర్జరీ చేసినట్లు, 4 రోగులకు సర్జరీ చేయలేమని, 3 కంటి అద్దాలు ఇవ్వనున్నట్లు, అలాగే విఠలాపూర్ గ్రామంలోని 44 మంది కంటి రోగులకు 29 మందికి క్యాట్రాక్ట్ సర్జరీ చేసినట్లు, 12 మంది రోగులకు సర్జరీ చేయలేమని, 3 కంటి అద్దాలు ఇవ్వనున్నామని, అలాగే చందలాపూర్ గ్రామంలోని 18 మంది కంటి రోగులకు పరీక్షలు మొదలుపెట్టామని, మొత్తం 79 మంది కంటి రోగులకు 38 మందికి సర్జరీ చేయగా, 16 మందికి సర్జరీతో అవసరం లేదని, మరో 6 మందికి కంటి అద్దాలు ఇవ్వనున్నట్లు ఆరోగ్య మంత్రి హరీశ్ రావు వివరించారు.నిత్యం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 80 మంది వరకూ ఆసుపత్రికి వస్తున్నారని, మరో ఆపరేషన్ థియోటర్ అవసరంపై మంత్రి దృష్టికి తేగా ఏర్పాటు చేయించేలా చొరవ చూపాలని ఎల్వీ ప్రసాద్ మేనేజ్మెంట్ విభాగాధిపతికి ఫోన్ లైనులో సూచించారు. ఈ మేరకు ల్యాబ్ లో కంటి సమస్యలతో బాధపడే రోగులకు చేస్తున్న చికిత్స విధానం పరిశీలించారు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.