కాంగ్రెస్‌ కప్పులో తుఫాన్‌

జగ్గారెడ్డి వ్యాఖ్యలతో అదిష్టానం సీరియస్‌
గట్టిగా మండదలించడంతో వెనక్కి తగ్గిన జగ్గారెడ్డి
తమది అన్నదమ్ముల పంచాయితీ అంటూ సంజాయిషీ
రేవంత్‌ రెడ్డితో విభేదాలు లేవని వ్యాఖ్య
గాంధీభవన్‌ విూటింగ్‌ వాడీవేడీగా సమావేశం
హైదరాబాద్‌,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తప్పు తెలుసుకుని సరిదిద్దుకున్నారు. నేరుగా విూడియాతో మాట్లాడడం తప్పేనని అంగీకరించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై చేసిన తీవ్ర వ్యాఖ్యల్లో రేవంత్‌ తప్పు లేదని.. తప్పంతా తనదేనని జగ్గారెడ్డి ఒప్పుకొన్నారు. తాను విూడియా ముందు వచ్చి నేరుగా మాట్లాడటం తప్పని.. తన తప్పును ఒప్పుకొని పార్టీకి క్షమాపణ చెప్పారు. రేవంత్‌రెడ్డి, తాను అన్నదమ్ముల్లాంటి వాళ్లమని తెలిపారు. విూడియా ముందు అలా మాట్లాడొద్దని పార్టీ ఇంఛార్జి చెప్పారని పేర్కొన్నారు. ఇక నుంచి నేరుగా పార్టీ వ్యవహారాలు విూడియాతో మాట్లాడనని జగ్గారెడ్డి వెల్లడిరచారు.
జగ్గారెడ్డి వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నష్టం కలిగించేలా ఉన్నాయన్న అభిప్రాయంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ రంగంలోకి దిగారు. ఈ విషయమై గాంధీభవన్‌లో వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షుల సమావేశం నిర్వహించారు. రేవంత్‌ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్‌లతోపాటు మరో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ సమావేశమయ్యారు. రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలకు జగ్గారెడ్డిని వివరణ కోరారు. అయితే ఈ భేటీలో కొంత వాడీవేడీ చర్చ జరిగిందని సమాచారం. ఓ సందర్భంలో పార్టీ నేతలపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే మాణిగం ఠాకూర్‌ గట్టిగా హెచ్చరించడంతో వెనక్కి తగ్గినట్లు సమాచారం. మాది అన్నదమ్ముల పంచాయితీ లాంటిది. ఏఐసీసీ అధ్యక్షులు సోనియా, రాహుల్‌ డైరెక్షన్‌లో పనిచేస్తా. మా యుద్ధం టీఆర్‌ఎస్‌, బీజేపీ పైనే అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. జగ్గారెడ్డి శుక్రవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తొలుత సీఎల్పీ
భేటీలోనూ, ఆ తరువాత విూడియాతో చిట్‌చాట్‌ సందర్భంగానూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌ ప్రొటోకాల్‌ పాటించడంలేదని, ఆయన పీసీసీ చీఫ్‌ కావడానికి ముందే తాను మూడుసార్లు ఎమ్మెల్యేనని తెలిపారు. సంగారెడ్డికి వస్తే తనకు కనీసం సమాచారం కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు. అసలు చర్చ లేకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని, కాంగ్రెస్‌ పార్టీ ఏమైనా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీయా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. సమావేశం అనంతరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ విూడియాతో మాట్లాడారు. జగ్గారెడ్డి నిన్న మాట్లాడిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారన్నారు. సమాచార లోపంతోనే వివాదం రాజుకుందని తెలిపారు. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు సరైనవే అని ఆయనపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. ఇకపోతే బూత్‌ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నామని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. విలేజ్‌, మండల కమిటీ, జిల్లా స్థాయి, రాష్ట్ర కమిటీలు పార్టీకి అవసరమన్నారు. కింది క్యాడర్‌ పరేషాన్‌ కానవసరం లేదని ఆయన చెప్పారు. జగ్గారెడ్డి లేవనెత్తిన అంశాలు సరైనవేనన్నారు.