కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
చేర్యాల (జనంసాక్షి) డిసెంబర్ 02 : కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో చేర్యాల పట్టణంలోని అంగడి బజార్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధం భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ మాట్లాడుతూ.. వంద సంవత్సరాలుగా కార్మికులు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ విదేశీ పెట్టుబడుదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను హరించి వేస్తున్నారని మండిపడ్డారు. బీడీ, చేనేత పరిశ్రమలపై జీఎస్టీ విధించి ఆ పరిశ్రమలు పనిచేయకుండా చేసి లక్షలాదిమంది కార్మికులకు ఉపాధి లేకుండా చేసిందన్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ లాంటి నిత్యవసర వస్తువులపై జీఎస్టీ విధించి ధరలు విపరీతంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెట్టడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేసి ఉన్న చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున కార్మిక ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య,ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉడుగుల శ్రీనివాస్, గజ్జల సురేందర్, గూడెపు సుదర్శన్, ముస్త్యాల శంకరయ్య, కొంగరి ప్రతాప్, భోనగిరి శేఖర్, కొడారి నర్సయ్య, కొల్పుల కిష్టయ్య, సుబ్బారావు, రాములు,ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.