కులవృత్తులకు పెరిగిన ప్రాధాన్యం

గొర్రెల పంపిణీతో యాదవులకు ఆర్థిక స్వావలంబన
జనగామ,ఆగస్ట్‌16(జనంసాక్షి): ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించి తద్వారా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టిందని జనగామెమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గొల్ల, కురుమ, యాదవ కుటుంబాలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కుటుంబాల ఆర్థిక జీవనం పెంపొందిం చేందుకు చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలను వదలడం, ఓబీసీల ఆర్థిక పురోగతికి ప్రత్యేక కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి నిధులు కేటాయించడంపై ప్రత్యేకదృష్టి సారించి అమలు చేస్తోందన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సంబంధించిన నిరుద్యోగులకు వారి అర్హతలను పరిశీలించి బ్యాంకు రుణాలు మంజూరీ చేసే కార్యక్రమాలు చేపట్టామన్నారు. జిల్లాలో ఉన్న గొల్లకురుమ, యాదవ కుటుంబాలకు చెందిన వారిని సంఘాలుగా ఏర్పాటు చేసి లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసినట్లు తెలిపారు. వీరికి రెండు సంవత్సరాల కాలంలో 75 శాతం సబ్సిడీపై గొర్రెల యూనిట్‌ను పంపిణీ చేస్తామన్నారు. ఈ ఏడాది కూడా లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేస్తామన్నారు. గొర్రెల రవాణాలోనూ, బీమా సౌకర్యం కల్పించడంలోనూ వాటిని తీసుకువచ్చాక పశుగ్రాసం అందంచడానికి అవరసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు వారి జీవనంలో ఆర్థికాభివృద్ధి పెంపొందించేందుకు చేపపిల్లలను ఉచితంగా నిలువ చేశామన్నారు. దీంతో మత్స్యకారుల సంఘాలకు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం దృష్ట్యా వారికి ఆర్థిక సాయం కల్పించేందుకు వారు చేసే పొదుపునకు ఎక్కువ లబ్ధి చేకూర్చేందుకు త్రిఫ్ట్‌ ఫండ్‌ పథకం ప్రారంభించినట్లు తెలిపారు.