కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి కృషి

ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
-బాధ్యతలు స్వీకరించిన పాలకమండలి సభ్యులు
జగదేవ్ పూర్ ,  ఆగస్ట్17 జనం సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని  ఆలయ చైర్మన్ గా నూతనంగా నియమితులైన  జంబుల శ్రీనివాస్ రెడ్డి  స్పష్టం చేశారు. జగదేవ్ పూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ లోని కొండ పోచమ్మ ఆలయానికి నూతనంగా నియమితులైన పాలకమండలి సభ్యులు బుధవారం ఆలయంలో  ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి హరీశ్ రావు సహకారంతో కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తానని పేర్కొన్నారు.  కొండపోచమ్మ ఉత్సవాలకు ప్రతియేటా భక్తుల రద్దీ పెరుగుతుందని  అందుకు అనుగుణంగా సౌకర్యాల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపడతానన్నారు. ప్రధానంగా  ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో దాతల సహకారంతో కాటేజీలను నిర్మించడంతో పాటు  నూతనంగా పబ్లిక్ మూత్ర శాలలను సైతం  నిర్మించనున్నట్లు వెల్లడించారు. కాగా అభివృద్ధి పనుల విషయమై త్వరలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సంప్రదించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ  సందర్బంగా  నూతనంగా నియామకమైన కొండపోచమ్మ చైర్మన్, పాలకమండలి సభ్యులు బాధ్యతలను స్వీకరించగా చైర్మన్ తో పాటు పాలకమండలి సభ్యులను ఆలయ ఈవో మోహన్ రెడ్డి, ఈ తీగుల్ నర్సాపూర్ సర్పంచ్  రమేష్ లు శాలువాలతో ఘనంగా సత్కరించారు.  ఈ కార్యక్రమంలో సర్పంచ్ రజీత రమేష్, ఈవో మోహన్ రెడ్డి, పాలకమండలి సభ్యులు దాచారం కనకయ్య, కనక రెడ్డి, జానకి రాములు, సంతోష్, రామచంద్రారెడ్డి, వెంకట్రాంరెడ్డి, కిషన్ చారి, ఆలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, కనకయ్య, హరిబాబు, పూజారులు లక్ష్మణ్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.