కోల్డ్‌ స్టోరేజ్‌ నిర్మాణం చేపడతాం


ఏజెంట్లు 4 శాతం కంటే ఎక్కువ కవిూషన్‌ తీసుకోవద్దు

సిఎం కెసిఆర్‌ ఆకస్మిక తనిఖీ – రైతులతో మాట్లాడి.. ధరలపై ఆరా

సిద్దిపేట / గజ్వేల్‌ జనవరి 27  (జనంసాక్షి):

సిద్దిపేటలో సీఎం కేసీఆర్‌ పర్యటించారు. సిద్దిపేట పట్టణంలోని ఒంటి మామిడి వ్యవసాయ, కూరగాయల మార్కెట్‌ కమిటీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ కూరగాయలు సాగు చేస్తున్న రైతులతో కేసీఆర్‌ మాట్లాడారు. పంటల సాగు, పెట్టుబడి వ్యయం, దిగుబడులు, మార్కెటింగ్‌ సౌకర్యం, బహిరంగ విపణిలో కూరగాయల ధరల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విపణిలో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేస్తే మంచి ధర లభిస్తుందని రైతులకు కేసీఆర్‌ సూచించారు. సాగు మెళకువలు తెలుసుకొని శాస్త్రీ య విధానంలో పంటల సాగు చేపడితే వ్యవసాయం, కూరగా యల సాగు లాభసాటిగా ఉంటుందన్నారు. కూరగాయల రైతుల నుంచి ఏజెంట్లు 4శాతం కంటే ఎక్కువ కవిూషన్‌ తీసుకోవద్దని, ఆ దిశగా మార్కెటింగ్‌ అధికారులు పర్యవేక్షిం చాలని ఆదేశించారు.కూరగాయలు నిల్వ చేసేందుకు కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణం చేపట్టాలని ఈ సందర్భంగా స్థానిక రైతులు కోరగా సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణంతో పాటు ప్రాథమిక సదుపాయాల కల్పనకు అనువుగా ఉండేలా 50 ఎకరాల స్థలాన్ని గుర్తించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. భవిష్యత్తు అవసరాలు, మార్కెట్‌ కమిటీ అభివృద్ధి కోసం ఒంటిమామిడి మార్కెట్‌ యార్డును మరో 14 ఎకరాల మేర విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. సిద్దిపేట జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు, వసతి గృహాలకు ఒంటిమామిడి మార్కెట్‌ నుంచే కూరగాయలు సరఫరా చేయాలని మార్కెటింగ్‌ అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా,గజ్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, అధికారులతో మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో కేసీఆర్‌ సవిూక్షించారు. అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సవిూక్షిస్తూ సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు.