చైనాలో మళ్లీ కరోనా విజృంభణ

వందలాది విమానాలను రద్దు
స్కూళ్లను మూసివేస్తూ ఆదేశాలు
బీజింగ్‌,అక్టోబర్‌21 (జనంసాక్షి) : కరోనాను అదుపు చేశామని ప్రకటించుకున్న చైనాలో మళ్లీ కల్లోలం చెలరేగుతోంది. కొత్తగా కేసులు పెరగడంతో జాగ్రత్తలు తీసుకుంది. దేశంలో మళ్లీ కరోనా కేసులు
వెలుగుచూస్తుండడంతో అప్రమత్తమైన చైనా వందలాది విమానాలను రద్దు చేసింది. స్కూళ్లను మూసివేసింది. పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు ప్రారంభించింది. తాజా కేసుల నేపథ్యంలో వందలాది విమానాలు రద్దయ్యాయి. ప్రధాన విమానాశ్రయాలైన జియాన్‌, లంరaౌ విమానాశ్రయం నుంచి దాదాపు 60 శాతం విమానాలు రద్దయ్యాయి. కాగా, నేడు చైనాలో 13 కొత్త కేసులు నమోదైనట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్‌ తెలిపింది. ఇతర దేశాలు క్రమంగా కరోనా ఆంక్షలు సడలిస్తున్నప్పటికీ చైనా మాత్రం ఇంకా ఆంక్షల చట్రంలోనే ఉంది. సరిహద్దులు మూసివేయడం, లక్షిత లాక్‌డౌన్‌ల కారణంగా కొత్త కేసులు వెలుగు చూడకుండా జాగ్రత్త పడుతోంది. దేశీయంగానైతే కరోనాను దాదాపుగా అదుపు చేసింది. తాజాగా గత ఐదు రోజులుగా ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో కొత్తగా కేసులు వెలుగుచూస్తున్నాయి. పర్యాటక బృందంలోని ఓ వృద్ధ జంట కారణంగానే కొత్త కేసులు వెలుగు చూస్తున్నట్టు అధికారులు గుర్తించారు. గన్షు ప్రావిన్స్‌, ఇన్నర్‌ మంగోలియాలోని జియాన్‌కు వెళ్లడానికి ముందు వారు షాంఘైలో బయలుదేరినట్టు అధికారులు తెలిపారు. వారి కారణంగా బీజింగ్‌ సహా ఐదు ప్రావిన్సులు, ప్రాంతాల్లో కేసులు వెలుగుచూస్తున్నాయి. దీంతో స్థానిక ప్రభుత్వాలు పెద్ద ఎత్తున టెస్టింగ్‌ ప్రారంభించాయి. ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, వినోద ప్రదేశాలు మూసివేసింది. హౌసింగ్‌ కాంపౌండ్‌లలో లక్షిత లాక్‌డౌన్‌లు విధించింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లొద్దని లంరaౌ నగర ప్రజలను స్థానిక అధికారులు ఆదేశించారు.