జిల్లా ఏర్పాటుకు జనం జై…!

      90% ప్రజలు జిల్లా ఏర్పాటుకు అనుకూలంగా ఓటు..!!
     శెట్టి పాలెం ప్రజాభిప్రాయ,సంతకాల సేకరణలో ప్రజల మనోగతం…!!!
మిర్యాలగూడ. జనం సాక్షి.
      మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ప్రజల ఆకాంక్ష.. జిల్లా ఏర్పాటుకు అవసరమైన అన్ని అవకాశాలు ఉన్నా అమలుకు నోచుకోక పోవడంతో ప్రతిఒక్కరి మదిలో నిరాశ అలుముకుని ఉంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరణ అనంతరం జిల్లాల పునర్విభజనలో మిర్యాలగూడ జిల్లాగా ఏర్పడుతుందని అందరూ ఆశించారు. దాంతో నాటి నుండి నేటి వరకు మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఆకాంక్ష అలానే కొనసాగుతుంది. అందులో భాగంగా గత వారం రోజుల నుండి మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ రోజురోజుకు పెరిగింది. మిర్యాలగూడ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా సాధన సమితి పేరుతో వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో జిల్లా ఏర్పాటు ఆకాంక్ష పేర్కొంటూ మిర్యాలగూడ ఆర్టీవో కార్యాలయంలో వినతిపత్రం సమర్పించగా వివిధ రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు కుల సంఘాలతో సైతం రెండుసార్లు సమావేశం కావడం జరిగింది.
   మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శుక్రవారం వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ప్రజాభిప్రాయ సేకరణ,సంతకాల సేకరణ చేపట్టారు. నల్లగొండ జిల్లాలో మొట్టమొదటిసారిగా మిర్యాలగూడ నియోజకవర్గంలోని శెట్టిపాలెం గ్రామంలో చేపట్టిన జిల్లా ఏర్పాటు అభిప్రాయానికి అనూహ్య స్పందన లభించింది. గ్రామానికి చెందిన యువతీ యువకులు విద్యావంతులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు పలికారు. మిర్యాలగూడ ను జిల్లాగా ఏర్పాటు చేయాలా? వద్దా? అంటూ సహజ పద్ధతిలో జరిగిన ఓటింగ్ కు 200 మంది పాల్గొన్నారు. 90% మంది ప్రజలు మిర్యాలగూడ జిల్లా కావాలని కోరగా 5% వద్దు అని మరో 5% వారి అభిప్రాయం వెల్లడించలేదు. 200 ఓట్లలో 178 మంది  మిర్యాలగూడ జిల్లా కావాలని ఓటు వేయగా, 11 మంది వద్దని,11 మంది ఎటు ఓటు వేయకుండానే వదిలివేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మిర్యాలగూడ జిల్లా సాధన సమితి సభ్యులు, బంజారా ఉద్యోగుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు మాలోతు దశరధ నాయక్, బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఆకాంక్ష ప్రజల్లో బాగా ఉందనడానికి ఓటింగ్ లో ప్రజలు పాల్గొని అనుకూలంగా ఓటు వేయడమే నిదర్శనమన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణలో 34 వ జిల్లాగా మిర్యాలగూడను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా ఏర్పాటు ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోందని ప్రజా ప్రతినిధులు వివిధ రాజకీయ పక్షాల నాయకులు స్వచ్ఛందంగా జిల్లా ఏర్పాటు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడ హుజూర్నగర్ నాగార్జునసాగర్ నియోజకవర్గలతో కలిపి జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేయాలని సూచించారు. మూడు నియోజకవర్గాల పరిధిలోని అన్ని గ్రామాలలో ఉద్యమ తీవ్రత వివరించడంతో పాటు సంతకాల సేకరణ ఓటింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా సంతకాల సేకరణ ప్రజాభిప్రాయ సేకరణకు పూనుకున్న శెట్టిపాలెం గ్రామస్తులను వారు అభినందించారు. కార్యక్రమంలో ప్రాథమిక సహకార సంఘం డైరెక్టర్లు పల్లవెంకటయ్య,గండ్ర వెంకట రెడ్డి, నాయకులు బోడ్డు వీరయ్య, మాజీ ఎంపిటిసి చిరుమర్రి రమణయ్య, మాజీ సర్పంచ్ ఇరిగి వెంకటయ్య, కోడిరెక్క సైదులు, ఇరిగి సైదులు, పెద్దమాం మట్టయ్య లక్ష్మీ నర్సు నక్క పున్నమ్మ మచ్చ రాంబాబు నిమ్మల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు