దీక్షిత్‌ కిడ్నాప్‌ కథ విషాదాంతం

– బాలుడిని చంపి పెట్రోల్‌తో తగులబెట్టిన కిడ్నాపర్లు

– కిడాప్‌ చేసిన గంటలోనే చంపేసినట్లు ఎస్పీ వెల్లడి

– ఈజీ మనీ కోసం ఘాతుకానికి పాల్పడిన దుండగులు

మహబూబాబాద్‌బ్యూరో,అక్టోబరు 22(జనంసాక్షి): దీక్షిత్‌ కిడ్నాప్‌ వ్యవహారం విషాదంగా ముగిసింది. కిరాతకులు బాలుడిని చంపి పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. మహబూబాబాద్‌లో కిడ్నాప్‌ అయిన దీక్షిత్‌ రెడ్డి పాలిట మేనమామ కంసుడిలా మారాడు. డబ్బులు కోసం తోబుట్టువుకు కడుపుకోత మిగిల్చాడు. మేల్లుడిని దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. గత ఆదివారం కిడ్నాప్‌ చేసిన దీక్షిత్‌ రెడ్డి… కిడ్నాపర్లు రెండు గంటల్లోనే బాలుడిని చంపేశారు. కిడ్నాప్‌కు సూత్రధారుడు మనోజ్‌రెడ్డితో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంద సాగర్‌ అనే వ్యక్తితో కలిసి బాలుడిని హత్య చేసినట్లుగా తెలుస్తోంది. మహబూబాబాద్‌కు 5 కిలోవిూటర్ల దూరంలోని గుట్టలో బాలుడి మృతదేహం లభించింది. కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడని ఆశపడ్డ ఆ తల్లి రోదన చూపరులను కంటతడి పెట్టిస్తోంది.

మహబూబాబాద్‌ కృష్ణా కాలనీకి చెందిన రంజిత్‌, వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటుండగా గత ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని దుండగుడు బైక్‌పై వచ్చి కిడ్నాప్‌ చేశారు. రాత్రి అయినా బాలుడు ఇంటికి రాకపోవడంతో పరిసర ప్రాంతాలను వెతుకగా ఓ వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లాడని తోడి స్నేహితులు చెప్పారు. రాత్రి 9:45 నిమిషాలకు కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్‌ చేసి రూ.45 లక్షలు ఇస్తే తమ బాలుడిని విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పవద్దని హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని, బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మంగళవారం రాత్రి కిడ్నాపర్లు మరోసారి ఫోన్‌ చేసి డబ్బులు రెడీ అయ్యాయా, బుధవారం ఉదయం ఫోన్‌ చేస్తాం అని చెప్పారు. చెప్పినట్లుగానే బుధవారం ఉదయం ఫోన్‌ చేసిన కిడ్నాపర్లు డబ్బు సిద్ధం చేసుకోండి, బ్యాగులో డబ్బు పెడుతున్నప్పుడు వీడియో కాల్‌ చేస్తే తమకు చూపించాలని చెప్పినట్లు సమాచారం. అన్నట్లుగానే మధ్యాహ్నం 12 గంటలకు కిడ్నాపర్లు వీడియో కాల్‌ చేయగా, బాలుడి తల్లిదండ్రులు డబ్బు చూపించారు. దీంతో కిడ్నాపర్‌ జిల్లా కేంద్రంలోని మూడు కొట్ల చౌరస్తా వద్ద డబ్బు బ్యాగ్‌తో ఉండాలని,, వచ్చి తీసుకుంటామని చెప్పారు. దీంతో బాలుడి తండ్రి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు డబ్బుతో ఎదురుచూశారు. ఆ సమయంలోనే పోలీసులు మాటువేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను గురువారం ఉదయం ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. దీక్షిత్‌ను హత్య చేశారని తెలియడంతో.. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలుడి కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుడు మంద సాగర్‌(23)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి విూడియాతో మాట్లాడారు. మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో నివాసం ఉంటున్న రంజిత్‌, వసంతల పెద్ద కుమారుడు దీక్షిత్‌రెడ్డి(9) ఆదివారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. శనిఘాపురం వాసి అయిన మంద సాగర్‌ సాయంత్రం 6 గంటల సమయంలో

బైక్‌పై వచ్చి.. బాలుడిని ఎక్కించుకుని వెళ్లాడు. ఆ తర్వాత.. అన్నారం వద్ద దానమయ్య గుట్ట వద్దకు తీసుకెళ్లిన సాగర్‌.. గంటలోపే బాలుడి గొంతు పిసికి హత్య చేశారు. రాత్రి 8 గంటల్లోపే సాగర్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు.

చంపిన తరవాత తల్లిదండ్రులకు ఫోన్‌

తల్లి వసంతకు సాగర్‌ ఫోన్‌ చేసి రూ.45 లక్షలు ఇస్తే విడిచిపెడతామని, ఈ విషయాన్ని విూరు ఎక్కడా చెప్పవద్దు, పోలీసులకు కంప్లైంట్‌ చేయవద్దు అని చెప్పాడు. విూ ఇంటి పరిసర ప్రాంతాలలో మా వ్యక్తులు ఉన్నారంటూ బెదిరించారు. విూరు ఏం చేసినా తమకు తెలుస్తుందని, విూ బాబుకు జ్వరం గా ఉంది మాత్రలు కూడా వేశాం అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. దీంతో దీక్షిత్‌ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పుడే కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మందసాగర్‌.. దీక్షిత్‌ కుటుంబానికి తెలుసు. డబ్బు డిమాండ్‌ చేసి దీక్షిత్‌ను వదిలిపెడితే తనకు ఏం జరుగుతుందో అని ఆందోళన చెందే బాలుడిని హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటర్నెట్‌ కాల్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేశాడు. బాలుడిని చంపిన తర్వాత కూడా రెండు రోజుల పాటు ఫోన్‌ చేసి తల్లిదండ్రులను బెదిరించాడు. అయితే బాలుడి హత్య విషయం బయటకు రావొద్దనే ఉద్దేశంతో.. మళ్లీ దానమయ్య గుట్ట వద్దకు వెళ్లి శవంపై పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. అయితే ఈజీగా డబ్బులు సంపాదించి.. విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతోనే దీక్షిత్‌ను కిడ్నాప్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతోనే నిందితుడు మంద సాగర్‌ను అరెస్టు చేశామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఇంటర్నెట్‌ కాల్స్‌ ద్వారానే నిందితుడిని గుర్తించగలిగామన్నారు. గురువారం ఉదయం 3 గంటలకు సాగర్‌ ను అరెస్టు చేశామన్నారు. ఈ కేసును చేధించేందుకు హైదరాబాద్‌, వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌తో పాటు సైబర్‌ కైమ్ర్‌ పోలీసులు కీలక పాత్ర పోషించారు.