నాడు ఎర్రబస్సులు..నేడు ఎలక్ట్రిక్‌ బస్సులు

` హైదరాబాద్‌ నగరమంతా ఇక ఎలక్ట్రిక్‌ బస్సులే..
` డీజిల్‌ బస్సులకు టీఎస్‌ఆర్టీసీ స్వస్తి
` త్వరలో నగర రోడ్లపై తిరగనున్న 860 ఎలక్ట్రిక్‌  బస్సులు
` మరో 300 బస్సులకు కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ
` డీజిల్‌ బస్సులతో పోలీస్తే ఎలక్ట్రిక్‌ బస్సులతో భారీగా తగ్గునున్న ఖర్చులు
` నగరంలోని అన్ని డిపోల్లో ఛార్జింగ్‌ పాయింట్లు..
హైదరాబాద్‌(జనంసాక్షి):కాలుష్య రహిత వాహనాలకు స్వస్తి చెప్పి.. పర్యావరణ హిత వాహనాలకు ప్రభుత్వం జై కొడుతున్నది. ఆ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్‌ మహానగరంలో డీజిల్‌ వాహనాలను క్రమక్రమంగా తగ్గిస్తూ విద్యుత్‌తో నడిచే వాటిని ప్రవేశ పెట్టేందుకు సమాయత్తమవుతున్నది.వచ్చే రెండు సంవత్సరాల్లో నగరంలో డీజిల్‌తో నడిచే సిటీ బస్సులకు శాశ్వతంగా స్వస్తి పలుకబోతున్నారు. నగరంలో ఇక మొత్తం విద్యుత్‌ బస్సులే తిప్పుబోతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 860 బస్సులు ఒకటి, రెండు నెలల్లో నగర రోడ్లపై తీరుగబోతున్నాయి. ఈ మేరకు టెండర్ల ప్రక్రియ పూర్తికావొచ్చింది. ఈ బస్సుల్లో ప్రస్తుతం 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులు కూడా ఉన్నాయి. వీటికి తోడుగా 50 ఇంటర్‌ సిటీ విద్యుత్‌ బస్సులను నడుపబోతున్నారు. అలాగే మరో 500 విద్యుత్‌ బస్సులు సైతం వస్తున్నాయని అర్టీసీ గ్రేటర్‌ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ఈ యాదగిరి తెలిపారు. అయితే ప్రస్తుతం సిటీలో తిరుగుతున్న 500 బస్సుల కాలం చెల్లింది. పైగా ఆ బస్సులన్నీ కూడా డీజిల్‌వే కావడం వల్ల కాలుష్యం కూడా పెరుగుతున్నది. దీంతో వాటి స్థానంలో విద్యుత్‌ బస్సులు నడుపనున్నారు. ఇదిలా ఉంటే మరో 300 విద్యుత్‌ బస్సులు కూడా త్వరలోనే సిటీకి రాబోతున్నాయన్నారు. ఈ క్రమంలో ఒకటి లేదా రెండు రోజుల్లో 50 శాతం వరకు విద్యుత్‌ బస్సులే తిరుగబోతున్నాయి. ఈ మేరకు నగరంలో వాయు కాలుష్యం తగ్గడానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కిలో విూటర్‌కు రూ.13 మిగులు..
డిజిల్‌ బస్సుల స్థానంలో విద్యుత్‌ బస్సులు తీసుకురావడం వల్ల ఆర్టీసీపై పడే ఆర్థిక భారం బాగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. పైగా విద్యుత్‌ బస్సుల వల్ల కిలో విూటర్‌కు రూ.13 మిగులుతుందని చెబుతున్నారు. కిలోవిూటర్‌కు విద్యుత్‌ బిల్లులు రూ.7 ఖర్చు వస్తుందని, అదే డీజిల్‌ ఖర్చు మాత్రం రూ.20 గా ఉంటుంని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో రూ.13 ఆదా అవుతుందన్నారు. అయితే డీజిల్‌ బస్సులతో పోల్చితే.. విద్యుత్‌ బస్సు ఖరీదు అధికంగా ఉన్నప్పటికీ.. నిర్వహణ ఖర్చులు బాగా తగ్గుతున్నాయని అంచనా వేసిన తర్వాతే విద్యుత్‌ బస్సుల వైపు ఆర్టీసీ అధికారులు మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది.
అన్ని డిపోల్లో ఛార్జింగ్‌ పాయింట్లు..
రానున్న రెండు సంవత్సరాలలో నగరంలో అన్ని బస్సు డిపోల పరిధిలో విద్యుత్‌ బస్సులు తిరుగుతాయి. దీంతో అన్ని డిపోల్లో ఛార్జింగ్‌ పాయింట్‌ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు రాబట్టడం కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం చెంగిచెర్ల, కాచిగూడ, బర్కత్‌పుర, మెహిదీపట్నం, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ వంటి పలు డిపోల పరిధిలో ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.