`పట్టణ పారిశుద్యానికి పెద్దపీట

చెత్తా చెదారం తొలగింపునకు ప్రాధాన్యం

కరీంనగర్‌,డిసెంబర్‌7 (జనంసాక్షి) : పారిశుద్య ప్రణాళికలో భాగంగా అధికారులు వార్డుల్లో సమస్యలు గుర్తిస్తున్నారు. ప్లాస్టిక్‌ సామాను, ఖాళీ సీసాలు, ఇనుప సామగ్రి తదితర పాత, వ్యర్థ వస్తువులను  తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్‌ పరిధిలో శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం ద్వారా పట్టణంలోని రోడ్లు, ఖాళీ స్థలాల్లో ఎక్కడ నీరు నిలువకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి అన్నారు. దోమల నివారణకు మురుగుకాలువలు అన్ని ప్రాంతాల్లో ఫాగింగ్‌ చేయించాలని ఆదేశించారు. రోడ్లపై చెత్త వేసేవారికి జరిమానా విధించాలన్నారు.  పారిశుద్యంపై ప్రతి అధికారి, సిబ్బందికి అవగాహన కలిగి ఉండాలని, లేకుంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని అన్నారు. నాటిన మొక్కల్లో ఒక్కటి ఎండినా.. దానికి సంబంధిత ప్రత్యేకాధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణకు హరితహారంలో పట్టణంలో మొక్కలు నాటే టార్గెట్‌ పూర్తిచేయాలన్నారు. ఇప్పటి వరకు నాటిన మొక్కలకు నీటి సరఫరా, సంరక్షణ చర్యలపై అన్ని విభాగాల అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. తమ పరిధిలో ఒక్క మొక్క ఎండిపోయినా బాధ్యుడిపై వార్డు అధికారిపై చర్యలు తీసుకుంటామని మరోసారి హెచ్చరించారు. మున్సిపల్‌ పరిధిలో ఏడాది చొప్పున ఐదేళ్ల ప్రణాళికతో కొత్త నర్సరీలను ఏర్పాటు చేసుకోవాలని, కొద్దిరోజుల్లోనే అన్ని వార్డుల్లో పచ్చదనం పెంచేందుకు అధికారులు, విభాగాల అధికారులు పకడ్బందీ ప్రణాళికతో వెళ్లాల్సి ఉంటుందని అన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి పెరిగి పెద్దయ్యే వరకు బాధ్యుడైన ఇన్‌చార్జి అధికారి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, తనిఖీలు చేసిన సమయంలో సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం కనిపించినా..ఫిర్యాదులు వచ్చినా సంబంధిత వార్డు ఇన్‌ఛార్జి అధికారిపై వేటు పడుతుందని స్పష్టం చేశారు. వార్డుల వారిగా మొక్కలను నాటడంతోపాటు ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయాలని, వీటి లెక్కలు పక్కాగా ఇన్‌ఛార్జిల వద్ద ఉండాలని ఆదేశించారు.