పాతనేరస్థుల కదలికలపై దృష్టి

వ్యస్తీకృత నేరాలపై ఉక్కుపాదం
హైదరాబాద్‌,అక్టోబర్‌2జనం సాక్షి : వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులపై సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక దృష్టి సారించారు. గతకొంతకాలంగా వరుస నేరాలకు పాల్పడుతున్న వారి చిట్టాను పరిశీలిస్తున్నారు. అలాగే జరుగుతున్న నేరాలకు వీరితో ఉన్న సంబంధాలపైనా ఆరా తీస్తున్నారు. వారిపై ఉక్కుపాదం మోపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో పోలీస్‌ స్టేషన్‌లో ఎంత మందిపై రౌడీషీట్‌ నమోదైంది, వారంతా ఎలాంటి
నేరాలకు పాల్పడేవారు, తరచూ ప్రజలను ఇబ్బందులకు, భయభ్రాంతులకు గురి చేస్తున్న వారెవరు జాబితాను సిద్ధం చేయాలని ఎస్‌హెచ్‌వోలను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో పాటు కొత్తగా పుట్టుకొస్తున్న నేరస్థులు, రౌడీల అడ్రస్‌లు, లొకేషన్స్‌ను జియో ట్యాగింగ్‌ చేస్తున్నారు. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన నేరస్థులతో పాటు.. పాత రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులను ఎస్‌హెచ్‌వోలు విడతల వారీగా పోలీస్‌ స్టేషన్‌కు పిలిపిస్తున్నారు. సీపీ ఆదేశాల మేరకు ఏసీపీల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. ఇకపై నేరాలకు పాల్పడినా, పద్ధతి మార్చుకోకపోయినా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. కైమ్ర్‌ పోలీసులు ఎప్పటికప్పుడు పాత నేరస్థుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందిని సీపీ ఆదేశించినట్లు తెలిసింది. అలాగే జరిగిన ప్రతి నేరంపైనా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.