పులిదాడితో భయాందోళనలో ప్రజలు

గతంలో విఘ్నేష్‌..ఇప్పుడు నిర్మలపై దాడి
పొలం పనులకు వెళ్లాలంటేనే  భయపడుతున్న ప్రజలు
పులిని బంధించి తమను కాపాడాలని వేడుకోలు
కొమ్రంభీం,నవంబర్‌30 (జనం సాక్షి):  జిల్లాలో మరోమారు తాజాగా పులిదాడితో జిల్లాలోని పెంచికల్‌ పేట మండలం కొండపల్లి పరిసర గ్రామాల్లో ఆందోళన నెలకొంది. ఆదివారం పులి దాడిలో వ్యవసాయ కూలీ నిర్మల మృతి చెందింది. కేవలం రోజుల వ్యవధిలో పులి దాడి చేయడంతో అంతా భయం చెందుతున్నారు. గతంలో విఘ్‌ఏష్‌ అనే యువకుడిని కూడా ఇదే విధంగా దాడిచేసి మతమార్చింది. ఆదివారం రాత్రి మృతదేహాన్ని తీసుకెళ్తుండగా అంబులెన్స్‌కు పులి ఎదురైంది. దీంతో పులి అలజడితో పొలాలకు వెళ్లేందుకు రైతులు  జంకుతున్నారు. పులిని బంధించి ప్రాణాలు కాపాడాలని గ్రామస్తుల వేడుకుంటున్నారు. మరోవైపు పులి దాడిలో మృతి చెందిన నిర్మల కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థికసాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే పులిదాడి చేసిన ప్రాంతంలో కెమెరాలతో పాటు బోనుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. పత్తి ఏరుతున్న సమయంలో బాలికపై పులి పంజా విసిరింది. తల్లి, సోదరుడు, ఏడుగురు కూలీల క్లళెదుటే బాలికను నోట కరచుకుని ఈడ్చుకెళ్లింది. మిగతావారు దాన్ని వెంబడిస్తూ గట్టిగా కేకలు వేయడంతో వదిలేసి పోయింది. అప్పటికే ఆ బాలిక ప్రాణాలు కోల్పోగా మృతదేహాన్ని కూలీలు వెనక్కి తీసుకొస్తున్న క్రమంలో పులి మళ్లీ వారివైపు రావడంతో కర్రలతో బెదరగొట్టగా ఎట్టకేలకు అడవిలోకి పారిపోయింది. ఈ భయానక ఘటన కుమురంభీం జిల్లా పెంచికల్‌పేట్‌ మండలం కొండపల్లి శివారులో ఆదివారం జరిగింది. రైతు అన్నెం సత్తెయ్య చేనుకు నిర్మల(16), ఆమె సోదరుడు రాజేష్‌, తల్లి లక్ష్మక్క, మరో ఏడుగురు కూలీలు ఆదివారం ఉదయం పత్తి ఏరేందుకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో కూలీలు, సోదరుడు, తల్లి చేనుకు ఒకవైపు భోజనం
చేస్తున్నారు. నిర్మల తన స్నేహితురాలితో కలసి మరోవైపు పత్తి ఏరుతోంది. ఈ క్రమంలో హఠాత్తుగా నిర్మలపై దాడిచేసిన పులి ఆమెను నోట కరచుకుని పోయింది. నిర్మల అరుపులతో ఉలిక్కిపడిన అక్కడున్నవారంతా దాన్ని వెంబడిస్తూ కేకలు వేయడంతో బాధితురాలిని కొద్దిదూరంలో వదిలి వెళ్లిపోయింది. నడుం, మెడపై తీవ్రగాయాలు కావడంతో ఆ బాలిక ఘటనాస్థలిలోనే చనిపోయింది. సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎఫ్‌వో శాంతారాం ఫోన్‌లో ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.5లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఈ ప్రాంతంలో రెండు బోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన విఘ్నేష్‌(19)ను పులి నవంబర్‌  11న గ్రామ సవిూపంలోనే వాగు పక్కన హతమార్చింది. 18 రోజుల అనంతరం మళ్లీ కొండపల్లిలో నిర్మలను పొట్టనపెట్టుకుంది. రెండు రోజుల కిందట పెంచికల్‌పేట్‌ మండలం ఆగర్‌గూడ పెద్దవాగు వద్ద పులి గ్రామస్థులకు కనిపించింది. ఈ మూడు ప్రాంతాలు అయిదు నుంచి 15 కి.విూ. పరిధిలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో విఘ్నేష్‌, నిర్మలలను హతమార్చిన పులి ఒక్కటేనని స్థానికులు అనుమాని స్తున్నారు. అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండే గ్రామాల ప్రజలు బయటకు రావడానికి వణికిపోతున్నారు. ఒక్కసారి మనిషి రక్తం రుచి మరిగిన పులి దాని కోసమే చూస్తుందని, జంతువులను వేటాడదని అటవీ
అధికారులే చెబుతున్న క్రమంలో.. ఆ పులిని బంధించేందుకు తక్షణం పటిష్ఠ చర్యలు చేపట్టాలని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని వారు వేడుకుంటున్నారు.