పోడుపై ప్రతిపక్షాల పోరు..


` 22న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా, 27న భారత్‌ బంద్‌కు పిలుపు
` 30న ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు
` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి
హైదరాబాద్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):జాతీయ, రాష్ట్ర స్థాయిలో పోడు భూముల సమస్య పరిష్కారానికి తెరాస, భాజపాయేతర పక్షాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. తెరాస, భాజపాయేతర ప్రతిపక్షాలనేతలు ఆదివారం గాంధీభవన్‌లో సమావేశమయ్యారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు భేటీ అనంతరం రేవంత్‌ విూడియాకు వెల్లడిరచారు. ఈ నెల 22న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా, 27న భారత్‌ బంద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. మహాధర్నా తర్వాత భారత్‌ బంద్‌ను విజయవంతం చేసేందుకు పార్లమెంటరీ నియోజకవర్గాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసుకొని సమావేశాలు పెట్టాలని పేర్కొన్నారు. 30న అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పిస్తాయన్నారు. అక్టోబర్‌ 5న పోడుభూముల సమస్యలపై ఆయా ప్రాంతాల్లో 400 కి.విూ. కనెక్టింగ్‌ కారిడార్‌లో ఉద్యమం చేస్తామని రేవంత్‌ తెలిపారు. ఆదిలాబాద్‌ నుంచి అశ్వరావుపేట వరకు పోడు రాస్తోరోకో నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు. సర్కారుపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.పోడు భూముల సమస్యను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్‌ మళ్లీ దళిత బంధు అంటూ మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఏడేళ్ల పాలనలో వేలాది ఎకరాల భూమిని కేసీఆర్‌ ప్రభుత్వం లాక్కుందని తెజస అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని అయన వివరించారు.