ఫిలిప్పీన్స్‌లో ‘మెగి’ బీభత్సం.. 58కి చేరిన మృతుల సంఖ్య


మనీలా,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):ఫిలిప్పీన్స్‌లో మెగి తుపాను బీభత్సం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.ఈ తుపాను కారణంగా బుధవారం మృతుల సంఖ్య 58కి చేరింది. భారీ వరదలతో అతలాకుతలమైన గ్రామాల్లో ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదను తవ్వుతూ బృందాలు తప్పిపోయిన వారికోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఆదివారం నాటి ఈ మెగి ప్రకృతి వైపరీత్యం కారణంగా సెంట్రల్‌ లేటె ప్రావిన్స్‌లోని బేబే నగరం చుట్టుపక్కల గ్రామాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మంచు చరియలు విరిగిపడటం, నదులు పొంగడంతో ఆ గ్రామాల్లోని ఇళ్లకు ఇళ్లు కొట్టుకుపోయాయి. లక్ష మంది ఫిలిప్పీన్స్‌ వాసులపై ఈ తుపాను ప్రభావం పడిరది. ప్రతి సంవత్సరం ఆ దేశంలో వర్షకాలంలో వరుస తుపాన్లు విలయం సృష్టిస్తూనే ఉంటాయి. కానీ ఇటీవల కాలంలో మండే ఎండల్లోనూ అక్కడ తుపాన్ల ప్రభావం కనిపిస్తోంది. భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు అధికంగా సంభవించే పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఈ దేశం కూడా భాగమే.