బార్‌ షాపుల ఏర్పాట్లలోనూ రిజర్వేషన్లు పాటిస్తాం

అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి శ్రీనివాసగౌడ్‌
హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించిన మాదిరిగానే బార్‌ అండ్‌ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. భారతదేశంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు సీఎం కేసీఆర్‌. వందల రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేశారు. విద్యతో పాటు బీసీ కులాలు ఆర్థికంగా ఎదిగేందుకు కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. ఆర్థిక వనరులపై సీఎం దృష్టి సారించారు. బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో కూడా రిజర్వేషన్లు ఇస్తామని హావిూ ఇచ్చారు. దీనిపై పరిశీలన చేస్తామన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. జిల్లాల వారీగా రిజర్వేషన్లు కల్పించి, నిష్పక్షపాతంగా కేటాయింపులు చేస్తామన్నారు. గౌడ కులస్తులను గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే చూశాయి అని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు.